May 28, 2013

దేశంలోకి యువ రక్తం, యూత్తమ్మా ...యూత్!



మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ద్వారా కొన్ని సంకేతాలను ఇచ్చింది. ఇప్పటికే సీనియర్లు కొంతమంది పార్టీని వీడగా దేశం మాత్రం ఇప్పుడు యూత్ ను కలుపుకొనిపోతుంది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే సభా వేదిక వద్ద హంగామా చేసేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తముళ్లు మహానాడు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండగా గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఇక ఈ మహానాడు ప్రాంగణంలో యువనేతలు హంగామా కన్పించింది. గత కొద్దికాలంగా రాజకీయ కార్యకలాపాల్లో ఉత్సాహాంగా పాల్గొంటూ నేతలను సమన్వయపరుస్తున్న చినబాబు లోకేష్ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఇక సభావేదిక మీద సీనియర్లకు స్థానం కల్పించి, లోకేష్ యువనేతలతో పాటు వేదిక ముందే కూర్చున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దివంగత నేత ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, పరిటాల రవీంద్ర తనయుడు శ్రీరాం ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించి పార్టీ భవిష్యత్ మీద ఆశలను చూపించారు.

ఇక వీరేకాకుండా కరణం బలరాం కుమారుడు, దేవేందర్ గౌడ్ కుమారుడు అలాగే అయన్నపాత్రుడు, దయాకర్ రెడ్డి, బొజ్జల కుమారులు కూడా మహానాడులో హంగామా చేశారు. ఈ యువరక్తాన్ని చూస్తుంటే వీరిని చూస్తుంటే 1983 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు. ఈ సంఘటనలు చూస్తుంటే లోకేష్ కు యూత్ లో మాంఛి ఫాలోయింగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.