May 28, 2013

కుక్కమూతి పిందెలు పోయాయి.. సీతాకోక చిలుకలే మిగిలాయి: బాలకృష్ణ

తటస్థ ఓటర్లకు గాలం వేద్దాం
గెలుపు గుర్రాలను మార్చను
పనిచేయని వారిని తప్పిస్తా
ఇక ఇంటింటికి తెలుగుదేశం
కాంగ్రెస్‌ అవినీతిపై ప్రచారం
మహానాడులో చంద్రబాబు
బాబు మంచి పాలకుడు
వైకాపాకు పుట్టగతులుండవ్‌
కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
రాజకీయ తీర్మానంలో 'దేశం' విసుర్లు


2014 ఎన్నికల విజయమే లక్ష్యంగా సాగిన తెలుగుదేశం పార్టీ రెండు రోజుల మహానాడు మంగళవారం ముగిసింది. చంద్రబాబు నాయుడు వరుసగా తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలిపలుకుల నుంచి తుది పలుకుల దాకా చంద్రబాబు ఇటు అధికార కాంగ్రెస్‌పార్టీపైనా అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైన విమర్శల నిప్పులు కురిపించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుందంటూ గులాబీ దండుపై ముళ్లదాడి చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేఖ కు కట్టుబడే ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మహానాడు ఆమోదించిన రాజకీయ తీర్మాణంలోనూ ఈ అంశాన్ని చేర్చారు. అలాగే వేదిక నుంచి ప్రసంగించిన నేతలు అదే బాణిని కొనసాగించారు. ఇదిలా ఉండగా తొలిసారి మహానాడుకు హాజరైన చంద్రబాబు తనయుడు లోకేష్‌ రెండు రోజుల పసుపు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు ఆహ్వానమే అందలేదని జూనియర్‌ అన్నారు అయితే పార్టీ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారం చేస్తానని తాత ఎన్టీఆర్‌ సమాధి సాక్షిగా ముక్తాయింపునిచ్చారు.

  రానున్న 2014 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 32వ మహానాడు వేదికగా తమ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా మంగళవారం గండిపేట “తెలుగువిజయం’ ప్రాంగణంలో మహానాడు రెండవ రోజున ఆయన కీలకాంశాలు వెల్లడించారు. జూన్‌ మొదటి వారంలో “ఇంటింటికీ తెలుగుదేశం’ అన్న కార్యక్రమాన్ని ప్రకటించారు. దుష్ట కాంగ్రెస్‌ అవినీతిని, కుంభకోణాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని తన శ్రేణులకు అధినేత ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తల సమస్యల పట్ల జిల్లా నాయకత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను గుర్తించి ధీటుగా ఎదుర్కొనే వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తానని హామీనిచ్చారు. రాజకీయాల్లో కొన్ని చిట్కాలు ఉంటాయని, వాటిని అలవర్చుకోవాలని ఉద్భోధించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలకు గెలుపే అంతిమ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లను ఆకర్షించాలని నొక్కి చెప్పారు. వారి ఓట్లను సాధిస్తే గెలుపు నల్లేరు బండిపై నడకేనన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అంతర్గత విభేదాలు కొంపలు కూల్చుతాయని గ్రహించిన చంద్రబాబు “విభేదాలు మర్చిపోతాం’ అని ప్రతినిధులందరితో ప్రమాణం చేయించారు. ఎన్నికల సీజన్‌ వచ్చిన నేపథ్యంలో ఏ కార్యక్రమాలు చేపడితే గెలుపు సులువవుతుందో వివిధ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీకి సూచించాలన్నారు. ఏ పార్టీకైనా గెలుపే ముఖ్యం. ఆ విషయంలో ఉదాసీనత పనికిరాదన్నారు. వరుసగా విజయాలు సాధిస్తున్నవారిని మార్చేదిలేదని భరోసా ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు ఉన్నారు. వారిలో కొందరు సరిగా పని చేయడంలేదు. ఒకటి రెండుసార్లు చెప్పిచూస్తా, అయినా వారు తీరు మార్చుకోకుంటే నిర్మొహమాటంగా మార్చేస్తానని హెచ్చరించారు. ఇక మొహమాటం పక్కకుపెట్టి ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై మాట్లాడతానని చెప్పారు. పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తానని చంద్రబాబు వెల్లడించారు. చాలా మందికి ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించదని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తానన్నారు. కంభంపాటి రామ్మోహన్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది నిస్వార్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రత్యేకించి వస్తున్నా మీకోసం యాత్రలో 700 మంది అంతే నిస్వార్థంగా పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులతో కరతాళధ్వనుల ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్పించారు. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పాదయాత్ర చేయలేకపోయానని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 1 నుండి బస్సు యాత్రను చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గడచిన సింగిల్‌ విండో ఎన్నికల్లో చాలా మంది సరిగా పనిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు అలాంటి వ్యవహార శైలిని సహించనని చెప్పారు. వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం తెప్పిస్తున్నానని వాటిని అధ్యయనం చేస్తానని అనంతరం పది నెలలకు సరిపడా పార్టీ శ్రేణులకు కార్యక్రమాలు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను అందిస్తానని చెప్పిన అధినేత అన్ని అనుబంధ సంఘాలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. చాలా మంది పార్టీకి ఊపు తెస్తే ఎలాగూ గెలుస్తామని భావిస్తారని అది సరికాదని హితవు చెప్పారు. తనకు కార్యకర్తలు కుటుంబ సభ్యులకన్నా మిన్న అని స్పష్టం చేసిన అధినేత వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.