May 28, 2013

మళ్లీ.... మహానాడు మన పాలనలోనే



  వచ్చే “మహానాడు’ నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండడం ఖాయమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షునిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో బీహార్‌కన్నా రాష్ట్రం వెనకబడి ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తానని రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని చేసిన ప్రమాణాన్ని ముఖ్యమంత్రి తుంగలో తొక్కారని విమర్శించారు. కళంకిత మంత్రులను కాపాడేందుకు ఎందుకు యత్నిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను ఇష్టానుసారం బదిలీలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తమ్ముడు డబ్బులు దండుకోని కీలక పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన మరో సోదరుడు చిత్తూరులో తిష్ట వేసి అడ్డగోలు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. సీఎం తమ్ముని లాలూచీ వ్యవహారాలు దేవాదాయ శాఖ మంత్రిని అడిగితే బాగా చెప్పగలరన్నారు. కాంట్రాక్టర్లతో లాలూచీపడి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తమ పార్టీ ఒత్తిడి మూలంగానే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని, అది పార్టీ సాధించిన పాక్షిక విజయమన్నారు. కళంకిత మంత్రులందరినీ సాగనంపేదాకా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మొత్తం వివాదాస్పదమైన 26 జీవోలతో సంబంధం ఉన్న మంత్రులు తమను నిర్దోషులుగా తామే నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం వారికి న్యాయ, ఆర్థిక సాయాలు అందించడం దారుణమన్నారు.. “ రాష్ట్రం తీవ్ర ్పన్నమయ్యాయని ప్రశ్నించారు. ఎపీపీఎస్సీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఉద్యోగాలను బాహాటంగా అమ్ముకొంటున్నారు. పేదలు వాటిని కొనుక్కోలేక నిరుద్యోగులుగా దుర్భర జీవితం వెల్లబోస్తున్నారని చెప్పారు.

ఉపాధి హామీ పథకంలో అవినీతిదే రాజ్యమని చంద్రబాబు చెప్పారు. దోచుకొన్న సొత్తు మెక్కి కాంగ్రెస్‌ నేతలు పందికొక్కుల్లా బలిశారన్నారు. ఎండవేడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతోంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని నిందించారు. ప్రకృతి విపత్తులుగా ప్రకటించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రైతుల వడ్డీ మాఫీ ఉత్తదేనని తేలిపోయిందన్నారు. ఉద్యోగులకు భద్రతలేదు. అంగన్‌వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందడంలేదు. చాలీచాలని జీతాలతో చిరుద్యోగులు అల్లాడుతున్నారని చెప్పారు. తన హయాంలో తాను ప్రజల ఆస్తులకు ధర్మకర్తలాగా వ్యవహరించానని తెలిపారు. ఎన్నడూ ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడలేదన్నారు. అయినా నాపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. నేను చేసిన తప్పేంటి? అని చంద్రబాబు ఆవేదనతో ప్రశ్నించారు. కొందరికి హైదరాబాద్‌, బెంగుళూరులో రాజభవనాలను తనదన్నే భవంతులున్నాయని చెపితే తప్పా? వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు. సీబిఐ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ప్రభావితం చేస్తున్నానని నన్నాడిపోసుకుంటున్నారు. నాకంత స్థాయి లేదు. టీడిపీని భూస్థాపితం చేస్తానని బీరాలు పలికిన గాలి జనార్దనరెడ్డి ఎక్కడున్నాడో అందరికీ తెలుసునన్నారు. తనపై విశ్వాసం, నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన మహానాడులో చర్చలు 28 గంటలు సాగాయి. దాదాపు 15 తీర్మానాలు ఆమోదం పొందాయి. వివిధ తీర్మానాలపై 52 మంది ప్రతినిధులు ప్రసంగించారు.