May 28, 2013

జులై నుంచి మళ్లీ బస్సు యాత్ర మహానాడులో ప్రకటించిన చంద్రబాబు నాయుడు

బస్సు యాత్ర చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఈ మేరకు రెండో రోజైన మంగళవారం మహానాడులో ఆయన ప్రకటించారు. గత
ఏడాది అక్టోబర్ 2న చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర 16 జిల్లాల్లోనే చేశారని, మిగిలిన జిల్లాల్లో
జులై నుంచి బస్సు యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈసారి బస్సు యాత్ర చేయాలని కోరుతున్నారని ఆయన అన్నారు.
కాగా, జూన్‌లో పార్టీ కార్యకర్తలకు హైదరాబాదులో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. శాసనసభా నియోజకవర్గానికి 40 మంది చొప్పున ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తామని
చెప్పారు. విద్యుత్తు సమస్యపై 1.5 కోట్ల మందితో సంతకాలు సేకరించామని, ఆ సంతకాలను అసెంబ్లీలో ప్రదర్శిస్తామని, ఆ తర్వాత గవర్నర్‌కు సమర్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజలతో మమేకం
కావడానికి బస్సు యాత్ర చేయనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ గుర్
తుతో నిర్వహించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలపై మహానాడులో ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన మంగళవారం ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని ఆయన అన్నారు. తమది నిజాయితీ గల పార్టీ
అని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. దోపిడీ దొంగల పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడం బాధగా ఉందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల తీరుపై వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరో సారి ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటిస్తారు.