April 13, 2013

కళంకిత మంత్రులు నోరు తెరవరేం?

ఒత్తిడికి లొంగారా?.. కుమ్మక్కయ్యారా?
వారిని సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు: టీడీపీ

హైదరాబాద్ : జగన్ అక్రమార్జనకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని టీడీపీ ప్రశ్నించింది. వాస్తవాలు చెప్పే దమ్ములేదా? అని సవాలు చేసింది. సీఎం కిరణ్ వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడింది. శనివారం ఆ పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మరో నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ కొడుకు రాష్ట్రాన్ని దోచాడని చెబుతున్న మంత్రులు ఆ దోపిడీదారులపై తీసుకొన్న చర్యలేమిటని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

"కళంకిత మంత్రులు ఎవరిదైనా ఒత్తిడితో ఫైళ్ళపై సంతకాలు చేశారా? లేక కుమ్మక్కై చేశారా? ఆనం రామనారాయణ రెడ్డో మరొకరో మాట్లాడటం కాదు. మీరెందుకు మాట్లాడరు?'' అని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో నితీష్ ప్రభుత్వం అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకొని.. వారి ఇళ్ళలో పాఠశాలలు పెడుతోందని, రాష్ట్రంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. "చంచల్‌గూడ జైలును జగన్ పార్టీ కార్యాలయం మాదిరిగా వాడుకొంటున్నారని మంత్రి ఆనం అంటున్నారు. కనీసం జైళ్ళను కూడా నియంత్రించలేనంత నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందా?'' అని తుమ్మల ప్రశ్నించారు.

"ముఖ్యమంత్రి చీఫ్ విప్‌గా అసెంబ్లీలో ఆయన జగన్‌ను నాడు వెనకేసుకొని రాలేదా? జగన్‌ను హత్య కేసులో రక్షించానని ఆయనే చెప్పారు. ప్రజలు ఇవేవీ మర్చిపోలేదు'' అని చెప్పారు. ధర్మాన, సబిత ఇరుక్కొన్న తర్వాత ఆనంకు జగన్ దోపిడీ గుర్తుకు వచ్చిందని, కోర్టులు ఆదేశించేంతవరకూ ప్రభుత్వంలోని వారు ఈ దోపిడీపై ఏం చేశారని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. "అవినీతిపరుల ఆస్తుల స్వాధీనానికి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న మంత్రులను ఇంకా మంత్రి పదవుల్లో ఎలా కొనసాగిస్తున్నారు? కేసుల్లో నిందితురాలిగా ఉన్న హోంమంత్రికి డీజీపీ సెల్యూట్ చేస్తే పోలీసులకు ఇక ఏం గౌరవం మిగులుతుంది? ముఖ్యమంత్రి, మంత్రులు ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అని సోమిరెడ్డి సూచించారు.

కాగా.. "వైఎస్‌నాటి మంత్రివర్గమే ఇప్పుడూ కొనసాగుతోంది. ఒకరిద్దరు తప్ప మంత్రులందరూ కళంకితులే. 26 జీవోల వ్యవహారంలో ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టే నోటీసులు పంపింది. ఒక మంత్రి జైలుకెళ్ళాడు. సీబీఐ చార్జిషీటులో 4వ నిందితురాలిగా హోంమంత్రే నమోదైన దుస్థితి రాష్ట్రానికి దాపురించింది'' అని యనమల మండిపడ్డారు.

వైఎస్ హయాంలో జరిగిన తెరవెనుక భాగోతాల గురించి గతంలో కొందరు మంత్రులు మాట్లాడారని, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా వెల్లడించారని అన్నారు. మైనింగ్ అక్రమ సంపాదనను ఆర్ఆర్ గ్లోబల్ సంస్థ ద్వారా జగతి పబ్లికేషన్స్‌లోకి మళ్ళించిన గాలి జనార్ధన రెడ్డి, అక్రమంగా సొమ్ము సంపాదించిన జగన్.. ఇద్దరూ తోడు దొంగలేనని యనమల వ్యాఖ్యానించారు. కాగా.. తెలియకుండా సంతకాలు చేశామంటే ఎలా అని, అసలప్పుడు ఏం జరిగిందో వాస్తవాలు బయట పెట్టాలని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.