April 13, 2013

రేపు బాబు వద్దకు దాడి వీరభద్రరావు

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు సోమవారం చంద్రబాబును కలవనున్నారు. వచ్చి కలవాలని చంద్రబాబు కోరడంతో వెళ్లి మాట్లాడాలని దాడి నిర్ణయించుకొన్నారు. అధ్యక్షుడు తనను దూరం పెడుతున్నారని దాడి నొచ్చుకొన్నారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దాడి మనస్తాపానికి గురయ్యారని 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన కథనం చూసిన తర్వాత చంద్రబాబు స్పందించారు.

ఆయన సూచనపై పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు శనివారం దాడితో మాట్లాడారని సమాచారం. రెండు మూడు విషయాలు తనను బాధించాయని దాడి ఆయనతో అన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పాత విషయాలు వదిలేయాలని, అధ్యక్షుడికి అండగా నిలవాలని కళా ఆయనకు విజ్ఞప్తిచేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ మరికొందరు సీనియర్లు దాడితో మాట్లాడారు.

పార్టీ వెబ్‌సైట్‌లో దాడి పేరు తొలగింపు కిందిస్థాయిలో అనుకోకుండా జరిగిందని, కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నిక కావడంతో పాతవారి పేర్లను కార్యాలయ సిబ్బంది తమకు తాముగా తొలగించారని, ఎవరో చెప్పి చేయించింది కాదని నేతలు ఆయనతో చెప్పారు. రెండు మూడు గంటలపాటు ఆయన పార్టీ కార్యాలయంలోనే గడిపారు. 'కొంత అగాధం ఏర్పడిన విషయం నిజం. కానీ అది తగ్గుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతారు. అధ్యక్షుడు కూడా ఆయనను పిలిచారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.