April 13, 2013

చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

గన్నవరంమెట్ట (విశాఖపట్నం జిల్లా): 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లాకు ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అపూర్వస్వాగతం లభించింది. సరిగ్గా సాయంత్రం 6.15 గంటలకు తూర్పుగోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు గ్రామమైన గన్నవరంమెట్ట శివార్లలో చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 23 మంది వేదపండితులు చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

చంద్రబాబునాయుడుకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పార్టీ రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వెలగలపూడి రామకృష్ణబాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సింహరాజు, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్, తదితరులు స్వాగతం పలికారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు గన్నవరంమెట్ట తరలివచ్చారు. మండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు మినహా దాదాపు పార్టీ నాయకులంద
రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యాలు

ఉత్తరాంధ్ర జిల్లాల సంస్కృతిని చాటిచెప్పేరీతిలో కోలాటాలు, గంగిరెద్దు వేషాలు, థింసా నృత్యం, పలు వాయిద్యాలతో వేలాది మంది ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. గన్నవరంమెట్ట ప్రాంతంలో చంద్రబాబు సుమారు గంటపాటు ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు.