April 13, 2013

జీవితంలో అనుకున్నది సాధించే వరకు రాజీ లేదు

విశాఖపట్నం: తాను జీవితంలో అనుకున్నది సాధించేవరకు రాజీ పడేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. కాళ్ల నొప్పులతో నరకయాతన అనుభవిస్తున్నా.. మీ అభిమానం చూస్తే ఇంకా ముందుకెళ్లాలన్పిస్తుందన్నారు. చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గన్నవరంలో మాట్లాడుతూ, హిందూపురంలో ప్రారంభించిన పాదయాత్ర 193వ రోజుకు 16వ జిల్లాలోకి అడుగుపెట్టడం జరిగిందన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే కొండలైన బద్దలు కొట్టగలనన్పిస్తుందన్నారు.

ఇంతవరకు బండి లాగానని, అయితే ఎడమ కాలు మెలి పడడంతో భరించలేనంత నొప్పిగా ఉందన్నారు. దీంతో రెండు రోజులు యాత్రకు విరామం ఇచ్చి తిరిగి మరలా కొనసాగిస్తామన్నారు. తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగించిందని, కరెంటు, వీధి దీపాలు వంటి సౌకర్యాలు కూడా ప్రజలకు లేకుండా చేసిందన్నారు. రాత్రి పూట గ్రామాల్లో గాడాంధకరం నెలకొందని, విద్యార్థులు చదువుకోవటానికి నానా అవస్థలు పడుతున్నారన్నారు. రైతులు పంపుసెట్ల వద్ద కాపురం చేస్తున్నారని 1994 కంటే ముందు కరెంటు కొరత ఉండేది కాదన్నారు.

జవాబుదారీతనం పెంచామని మిగులు కరెంటు, మిగులు బడ్జెట్ ఇచ్చామని, చార్జీలు స్పల్పంగా పెంచామని, భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లలో ప్రతిరోజు తొమ్మిది గంటల చొప్పున పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇళ్లకు కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి చేస్తున్నారని, గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఆరుకి తగ్గించేశారని ఒక్కొక్క బండ రూ.475కు పెంచారన్నారు. ఆరు దాటితే ఒక్కొక్క సిలిండర్ రూ.1030కి కొనుగోలు చేయమంటున్నారని, దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆధార్ ఉంటే తప్ప సబ్సిడీ ఇవ్వమంటున్నారని, కిలో బియ్యం రూ.10 నుంచి 45కు పెంచారని, కేజీ పప్పు రూ.22 నుంచి 75 చేశారని, చక్కెర రూ.12 నుంచి రూ.45 చేశారని , ఉప్పు రెండు నుంచి రూ.12 చేశారని, ఈ ముఖ్యమంత్రితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరకు డీఏపీ, యూరియా బస్తా రూ.420 నుంచి రూ.1275కు పెంచారని, ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని, ఆ ఫైల్ పైనే తాను ముఖ్యమంత్రిని అయితే తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారుస్తామని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, 9 గంటలు విద్యుత్ ఇస్తామని టీడీపీ చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ అవినీతికి మారుపేరని నిరూపిస్తున్నామన్నారు. బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పట్టణాల్లో తాగునీటి కల్పిస్తామని, వృద్ధులకు, వితంతువులకు రూ.600 పెన్షన్ సదుపాయం కల్పిస్తామని, వికలాంగులకు వెయ్యి నుంచి రూ.1300 వరకు పింఛన్లు అందజేస్తామన్నారు. యువతకు భారీగా ఉద్యోగాలు, పేదలకు ఉచితంగా ఇళ్లు కేటాయిస్తామన్నారు. ప్రతీ ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని, బీఈడీ విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నర్సీపట్నం, అనకాపల్లిలో వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు సీఎంఈవై పథకాన్ని పునరుద్ధరిస్తామని, డ్వాక్రా సంఘాలకు వడ్డీ మాఫీని చేస్తామని ప్రకటించారు. వడ్డీలేని రుణాలిచ్చి పురుషులకు దీటుగా మహిళల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బాలిక సంరక్షణ పథకం పునరుద్ధరణ చేసి పెళ్లి సమాయానికి రెండు లక్షలు అందే ఏర్పాటు చేస్తామన్నారు.బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రూ.10 వేల కోట్లతో రుణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎస్సీలకు వర్గీకరణ తీసుకొస్తామని, మాలలకు, మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. రూ.2500 కోట్లతో ముస్లీంలకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తాను ఏ స్వార్ధంతోనూ పాదయాత్ర చేయడం లేదని, పదవి కోసం రాలేదని, మీ కోసమే మీ సమస్యలు వినడానికి వచ్చానని, మీ ఇంట్లో పెద్ద కొడుకుగా భావించి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మీ సేవకుడిగా ఉంటానని, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తానని, జై..జన్మభూమి..అంటూ ముగించారు.
పాదయాత్రకు విరామం

విశాఖపట్నం: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం రాత్రి శృంగవరంలో బస చేశారు. సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి నుంచి విశాఖ జిల్లా గన్నవరంమెట్టలో అడుగుపెట్టిన చంద్రబాబునాయడు గన్నవరంమెట్ట, మన్యపురట్ల జంక్షన్, శరభవరం వరకూ మూడు చోట్ల మాట్లాడారు. మొత్తం ఆరు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు శృంగవరం గ్రామానికి ముందు కొబ్బరి తోటలో రాత్రి బస చేశారు.