April 26, 2013

మరో విజయం కోసం!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను జిల్లాలో విజయవంతం చేసిన నేతలు మరో సక్సెస్ కోసం తపిస్తున్నారు. ఈ నెల 27న విశాఖపట్నంలో పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి భారీగా కార్యకర్తలను తరలించేందుకు 'దేశం' నేతలు సన్నాహాలు చేసుకున్నారు. జిల్లాలో చంద్రబాబు యాత్ర 24 రోజులపాటు సాగింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 12వరకు జిల్లాలో 11 నియోజకవర్గాలు, 16 మండలాలు, 2 కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలు, 78 గ్రామాల్లో బాబు పాద యాత్ర చేశారు. రాజమండ్రిలో ప్రవేశించి కోటనందూరు మండలం కాకరాపల్లి దాటి విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే వరకు వందలాది మంది నేతలు, వేలాది మంది కార్యకర్తలు చంద్రబాబును వెన్నంటే ఉన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు.

'దేశం' ఆవిర్భావ పండుగ ఇక్కడే! చంద్రబాబు పాదయత్రలో ఉన్న సమయంలోనే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెదపూడిలో జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరపాలని నిర్ణయించి అక్కడ భారీ పైలాన్ ఏర్పాటుచేశారు. పాదయాత్ర ఆలస్యం కావడంతో ఈ కార్యక్రమం పెదపూడిలో జరిగింది. తర్వాత పిఠాపురం వచ్చిన సందర్భంగా ఆ పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం ఇదే తొలిసారి.

ఉగాది ఆనందం.. తుని నియోజకవర్గంలో చంద్రబాబు ఉగాది ఉత్సవాలు జరుపుకున్నారు. ఉగాది పచ్చడి ఆరగించారు. పంచాంగశ్రవణాన్ని అత్యంత శ్రద్ధగా విన్నారు. ఏరువాక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

2,500 మైలురాయి ఇక్కడే.. చంద్రబాబు పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలురాయిని మండపేటలో అధిగమించారు. ప్రజా సమస్యల కోసం ఒక రాజకీయ నాయకుడు ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేయడం దేశంలోనే అరుదైన ఘట్టంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు.

విద్యుత్ ఉద్యమానికి నాంది విద్యుత్ కోతలు, సర్‌ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమానికి చంద్రబాబు ఇక్కడే శ్రీకారం చుట్టారు. కాకినాడలో ఒక రోజు ఉపవాస దీక్ష కూడా చేశారు.

కాపులకు ప్యాకేజీ ప్రకటనా ఇక్కడే అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్ల హామీ ఇచ్చిన చంద్రబాబు కాపులలో పేదల కోసం రూ.5 వేల కోట్ల ప్యాకేజీని పిఠాపురం బహిరంగ సభలో ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా జిల్లాలో కాపు సామాజికవర్గం టీడీపీకి దగ్గరవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

విశాఖ సభకు భారీగా జనసమీకరణ! విశాఖపట్నంలో పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఇక్కడ నుంచి వెళ్లే కార్యకర్తలందరికీ రవాణా, భోజన సదుపాయాలను ఆయా నేతలే సమకూరుస్తున్నారు.