April 26, 2013

బాబుకు సబ్బ'వరం'

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారంసబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. పెందుర్తి నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కేడర్‌తో సబ్బవరం కిటకిటలాడింది. అంతకు ముందు అసకపల్లి జంక్షన్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఇరువాడ మీదుగా సాయంత్ర ఆరు గంటల ప్రాంతంలో సబ్బవరం చేరుకున్నారు. దారిపొడవునా చంద్రబాబుకు జనం జేజేలు పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. చేతివృత్తుల వారు చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఆయన వారికి పలు హామీలు ఇచ్చారు. సబ్బవరం మూడురోడ్ల జంక్షన్‌లో అశేష్ జనవాహినిని ఉద్దేశించి సుమారు గంటపాటు ప్రసంగించారు. స్థానిక సమస్యలపై అనర్గళంగా మాట్లాడారు.

కీలకమైన సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, జగన్ లక్ష కోట్లు దోచుకున్న వైనాన్ని మీకు తెయజేప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. 'నాకు ఎవరిపైనా కక్ష, కోపం లేవు. అయితే ప్రజలు మోసపోవడాన్ని తట్టుకోలేకే ఈ ప్రాంతానికి వచ్చాను'' అని అన్నారు. గతంలో అనేకసార్లు ఇక్కడికి వచ్చానని ఈసారి మరింతగా ఆదరించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. స్థానిక సమస్యలను బండారు తెలియజేయగా వాటిపై ఏకధాటిగా మాట్లాడారు. మహిళలను అక్కలుచెల్లెళ్లు అని, యువకులను తమ్ముళ్లూ అంటూ సంబోధిస్తూ వారి మన్ననలు పొందేందుకు ప్రయత్నించారు.

కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించాలని, జగన్ చేసిన తప్పును మనం సమర్థిస్తామా అంటూ ఆయన ప్రశ్నించగా, వద్దు... వద్దు... అంటూ ప్రజలు ప్రతి సమాధానం చెప్పారు. అనంతరం చంద్రబాబునాయుడు జోడుగుళ్ల జంక్షన్, సూరిరెడ్డిపాలెం మీదుగా అమృతపురం చేసుకున్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, నాయకులు జి.మాధవరావు, సేనాపతి వసంత, సుగుణాచౌదరి, గుడివాడ అమర్, సతివాడ శంకరరావు, రెడ్డి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.