April 26, 2013

విశాఖరూపురేఖలు మారుస్తా


విశాఖపట్నం: అధికారం చేపట్టగానే విశాఖ జిల్లా రూపురేఖలు మారుస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సబ్బవరం కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, విశాఖను పరిశ్రమల కేంద్రంగా మారుస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ ప్రజలను మోసం చేశారన్నారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని, రూ.7.800 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఏర్పాటు చేస్తామని చెప్పి ఏమీ చేయలేకపోయారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆయా ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేస్తామన్నారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం 578 జీఓను విడుదల చేస్తే, దాన్ని రద్దుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలను మోసం చేసిందన్నారు.

వీలైనంత త్వరలో అప్పన్న భూ సమస్య పరిష్కారానికి కృషి చేసి స్థానికంగా ఉన్న ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. మండల కేంద్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, రైతాంగాన్ని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ మండలంలోనూ డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితిని తప్పించి అర్హత గల ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మహిళా నేతలు నన్నపనేని రాజకుమారి, శోభ హైమవతి, జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ పాల్గొన్నారు.