April 26, 2013

ఒక నాయకుడు వెళ్లిపోతే 50 మంది తయారవుతారు..

విశాఖపట్నం: కొందరు నాయకులు తప్పులు చేసి పార్టీ వీడుతున్నారని, అటువంటి వారివల్ల పార్టీకి నష్టం ఉండదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఒక నాయకుడు వెళ్లిపోతే 50 మంది నేతలను తయారుచేసే సత్తా పార్టీకి ఉందన్నారు. గురువారం సాయంత్రం సబ్బవరం మండలం సున్నపుబట్టీల వద్ద కొబ్బరితోటలో జరిగిన ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందరో కార్యకర్తలు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని నిరుపేదలయ్యారని, అలా అని వారు ఎక్కడా రాజీపడలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి నిజమైన ఆస్తి కార్యకర్తలేనని ఆయన ప్రశంసించారు.

2014లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పార్టీలో చాలాసార్లు సంక్షోభాలు వచ్చాయని, సంక్షోభం వచ్చిన ప్రతిసారీ పార్టీ మరింత రాటుతేలింది తప్ప వెనుకబడలేదన్నారు. ఎన్నికలు ఇక కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఉన్నాయని, ఈలోగానే కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

పట్టణ కార్యకర్తలు ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి గ్రామీణప్రాంతాల కార్యకర్తల కంటే పట్టణాల్లో ఉన్నవారు మరింత ఎక్కువగా పనిచేయాలని చంద్రబాబు విశాఖ నగర పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యలపై పనిచేస్తామనే నమ్మకం కల్పించినపుడే పట్టణాల్లోని ప్రజలు కార్యకర్తల చెంతకు వస్తారన్నారు. సెల్‌ఫోను మెసేజ్‌లు, ఫేస్‌బుక్, ట్విట్టర్లు వంటి సాంకేతిక మాద్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. అన్నింటికి మించి నోటి ప్రచారాన్ని పెంచాలని సలహాలిచ్చారు. ఎన్నికల్లో పనిచేస్తేనే ఓట్లు రాలవని,నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేస్తేనే ప్రజల నుంచి స్పందన ఉంటుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే అవినీతిపై పోరాడండి సమీక్షా సమావేశం సందర్భంగా ఎలమంచిలిలో బహుళనాయకత్వ సమస్యపైనా, ఏ ఇన్‌చార్జికి టిక్కెట్ ఇవ్వాలన్న అంశంపై కార్యకర్తలు లేవనెత్తిన ప్రశ్నలు డిమాండ్లకు చంద్రబాబు తీవ్రంగానే స్పందించారు. ఎలమంచిలిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి? ఎవరిని గెలిపించుకోవాలనేది? పార్టీ ఆలోచిస్తుందన్నారు. అంతకంటే ముందు కార్యకర్తలు, నాయకులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆదేశించారు. కన్నబాబురాజు అవినీతిని ప్రజలముందు బట్టబయలు చేయాలన్నారు. అటువంటి ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజలంతా తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తక్షణమే పల్లె పల్లెకు కార్యకర్తలంతా తిరిగి ప్రజలకు టీడీపీ చరిత్రను పార్టీ విధానాలను తెలియజేయాలని ఆయన కోరారు. సమావేశంలో పలుమార్లు సాక్షి పత్రికపై ధ్వజమెత్తారు. అదో దిక్కుమాలిన పేపర్ అంటూ అభివర్ణించారు.

సాక్షి పత్రికపై బాబు మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు జేజేలు కొట్టారు.

సమీక్షా సమావేశంలో వేదికపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అర్బన్ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, మాజీఎంపీ పప్పల చలపతిరావు, రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, ఎలమంచిలి నాయకులు లాలం భాస్కరరావు, సుందరపు విజయకుమార్ కూర్చున్నారు. కార్యకర్తల సమావేశానికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి భారీగా కార్యకర్తలతో ర్యాలీగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నల్లూరి భాస్కరరావు, చోడె వెంకట పట్టాభిరాం, ఆళ్ల శ్రీనివాసరావు, ఒమ్మి సన్యాసిరావు, బొట్టా నీలిమ, కోన తాతారావు, లేళ్ల కోటేశ్వరరావు, తాళ్ల ఆనంద్, రెడ్డి నారాయణరావులు పాల్గొన్నారు. ఇక, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి గొంతిన నాగేశ్వరరావు, లాలం భాస్కరరావు, ఆదిరి రమణ, రాజానరమేష్‌కుమార్, దాడి ముసలినాయుడు, విజయ్‌బాబు, దిన్‌బాబు, ఎస్.నాగేశ్వరరావు, బాపినాయు
డు, దాడి కృష్ణ, రఘు, గనగళ్ల వివేక్, పిళ్లా రమాకుమారి, ఆడారి మంజు, మొల్లేటి సరళ, ఆడారి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

అరకులోయ సమీక్ష వాయిదా

ఎలమంచిలి, విశాఖ తూర్పు, అరకులోయ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అరకులోయ సమీక్ష సమావేశం గురువారం జరగలేదు. మరోసారి అరకులోయ, సిటీలో మిగిలిన రెండు నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.