March 21, 2013

జన గోదావరి

'పేదవాడి ప్రాణం కంటే నా ప్రాణం గొప్పకాదు. పేదల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నాను. నాకేం కోరికలు లేవు. పదవీ కాంక్ష కూడా లేదు. మీ దయవల్ల తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. మీ సమస్యలే నా సమస్యలు, మీ కష్టాలే నా కష్టాలుగా చూస్తున్నాను. అప్పట్లో మనల్ని చూసి బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఈ కాంగ్రెస్ దొంగలు అధికారంలోకి వచ్చి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని జైల్లో నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ' అని చంద్రబాబు విమర్శించారు

చంద్రబాబు 'మీ కోసం వస్తున్నా' 170వ రోజు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 13 కిలోమీటర్ల మేర సాగింది. ఈసందర్భంగా చంద్రబాబు విద్యుత్ కోతల గురించీ, చార్జీల వడ్డన గురించీ, గ్యాస్ సమస్యల గురించీ ప్రస్తావించారు. కాంగ్రెస్ దొంగల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. ధరల పెరుగుదలతో పేద, సామాన్య వర్గాలు సతమతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 'నేను మీ ఇంట్లో పెద్దకొడుకులాంటివాడ్ని. ప్రయోజకుడైన కొడుకు ఎలా కుటుంబాన్ని ఆదుకుంటాడో.. రేపు అధికారంలోకి వచ్చాకా నేనూ ఆ పని చేస్తాను. ఎన్నికల ఒక్క రోజూ నాకివ్వండి.. ఐదేళ్లూ మిమ్మల్ని ఆదుకునేందుకు నేను కష్టపడతాను..' అన్నారు.