March 21, 2013

రాజమండ్రిని హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తా..

చారిత్రక నగరమైన రాజమండ్రిని హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తానని ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటుచేయడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి ఇక్కడ వారికే ఇక్కడే ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు హమీ ఇచ్చారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద సెంటర్‌లో ఆశేష ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇది పారిశ్రామిక వ్యాపారిక కేంద్రమని, ఇక్కడ గ్యాస్ ఉంది. నీళ్లు ఉన్నాయి. బాగా పనిచేసే మీరు ఉన్నారు ఇంకేటి ఇక్కడ అభివృద్ధి సంగతి తాను చూసుకుంటానన్నారు. రోడ్లు, డ్రైనులు, ఇళ్లుతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో మంచి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

అపూర్వ స్వాగతం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. ఏకంగా గోదావరి బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరువైపునకు వెళ్లి ఆయనతో కలిపి పాదయాత్ర చేసుకుంటూ జిల్లాలో ప్రవేశించారు. మొదట చంద్రబాబు కేక్ కట్ చేసి ప్రజలు స్వాగతం అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, సీనియర నేత గన్ని కృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చిన్నరాజప్ప, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అనేక మంది నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

గోదావరి బ్రిడ్జి మీద బాబు పాదయాత్ర: రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద చంద్రబాబు నాయుడు సుమారు రెండున్నర గంటలపాటు పాదయాత్ర చేశారు. సుమారు 4 కిలోమీటర్ల పొడవు వున్న ఈ బ్రిడ్జి మీద జన తాకిడితో ఈ పాదయాత్ర చాలా ఉత్సాహంగా సాగింది. బాబు ఉల్లాసంగా ఎవరో ఒకరితో మాట్లాడుతూ మధ్యమధ్యన ప్రజల స్వాగతాన్ని స్వీకరించి పాదయాత్ర సాగించారు. మధ్యలో ఆయనకు రైతులు నాగలి బహూకరించారు.

మహిళలు హారతి ఇచ్చారు. గోదావరిలో వందలాది పడవలకు పసుపు జెండాలు అలంకరించి మత్స్యకారులు స్వాగతం పలికారు. బ్రిడ్జికి అలంకరించిన పసుపు జెండాలు చల్లటి గాలికి రెపరెపలాడడంతో పాటు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో బాబు యాత్ర ఉత్సాహంగా సాగింది. మధ్యమధ్యలో బాబు గోదావరిని చూస్తూ తగ్గిన నీరును అక్కడ మత్స్యకారులను, చుట్టు వున్న పరిసరాలను కూడా పరిశీలించారు

మహానుభావులను స్మరిస్తూ...

రాజమండ్రి: చంద్రబాబు రాజమండ్రిలో ప్రవేశించగానే ప్రకాశపంతులు, ఆదికవి నన్నయ్య, వీరేశలింగం, రాజరాజనరేంద్రుడు వంటి మహానుభావులను స్మరించారు. వారితో ఈ చారిత్రక రాజమండ్రితో వున్న సంబంధాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు కూడా ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ తెలుగును బాగా మాట్లాడవారే, ప్రేమించేవారు ఇక్కడ అధికంగా ఉన్నారన్నారు.

మంచి సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న ప్రాంతమని గోదావరి పుష్కరాల సమయంలో ఎంతో అభివృద్ధి చేశానని కాని ఇవాళ కాంగ్రెస్ దొంగలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఇక్కడ పరిస్థితిని చూస్తే బాధకలుగుతుందన్నారు. రోడ్ కం రైలు బ్రిడ్జి మీద ఎవరైనా గర్భవతి వస్తే ఆసుపత్రి అవసరం లేకుండా డెలివరి అవుతుందని బ్రిడ్జి పరిస్థితిని విశదీకరించారు. కందుకూరి వీరేశలింగం సాంఘిక విప్లం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం ఈ ప్రాంతానిక గత చరిత్రగా మిగిలిపోయాయనని కాని ఈ ఇవాళ గజదొంగల పాలనలో ఈ ప్రాంతం అణగారిపోతుందన్నారు.