March 21, 2013

రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయం : కోడెల


నరసరావుపేట రూరల్: రాబోయే పంచాయతీ, మండల, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే విజయమని మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పమిడిపాడు గ్రామంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ వద్ద గ్రామస్తులనుద్దేశించి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ 175 రోజులుగా అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడని, 63 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడన్నారు.

రైతులు, రైతు కూలీలు, దళితులు, మైనార్టీలు చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు అందిస్తున్నారన్నారు. వ్యవసాయదారులు అప్పుల్లో కూరుకుపోయారని, పండించిన ధాన్యం, మిర్చి, పత్తికి గిట్టుబాటు ధర లేదన్నారు.

రైతు వద్ద ధాన్యం ఉన్న సమయంలో రూ. 750 అమ్మితే ఇప్పుడు అదే ధాన్యం రూ. 1800 పలుకుతుందని, దీంతో దళారీలు బాగు పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం రుణమాఫీపై చేస్తారన్నారు. గ్రామంలో అనేక రోడ్లు, కాలనీలు, పొలాలకు రోడ్లు వేయించామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాన ఏం పనులు చేశారో అడగాలన్నారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను వదిలి వేశారని, మంత్రి, మంత్రి కుమారుడు దోచుకుంటున్నారని, ముడుపులు ఇస్తేనే నరసరావుపేటలో పని జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కూలీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన పమిడిపాడు గ్రామస్తులకు చెందిన 400 ఓట్లు అధికారులు తొలగించారని, మన ఓట్లు చేర్చుకొని దొంగ ఓట్లు తొలగించాలన్నారు. సహకార ఎన్నికల్లో ఆందోళన చేస్తే లాఠీ చార్జీలు చేసి, కేసులు పెట్టి జైలులో పెట్టినా భయ పడలేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు జైలుకు వెళ్తున్నారని, భ్రస్టుపడిన ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహనరెడ్డి లక్ష కోట్లు సంపాదించటం దుర్మార్గమని, అది అంతా పేద ప్రజల డబ్బేనన్నారు. గ్రామంలో పారా నాగేశ్వరరావు, శంకరయ్య, అప్పారావు, మరో వందమంది టీడీపీలో చేరటాన్ని ఆయన ఆహ్వానించారు. పూలు చల్లుతూ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు తిలకందిద్ది హారతులు పట్టారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూనాటి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నరమాల శ్రీను, మాజీ జడ్పీటీసీ పెండ్యాల అప్పారావు, ఇస్సపాలెం మాజీ సర్పంచ్ పమిడి జగన్నాధం, బత్తుల వెంకటేశ్వర్లు, చల్లా పాపారావు, చల్లా అంజయ్య, సాంబయ్య, కేతు పుల్లయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రి యాదవ్, షేక్ బాబు, కొట్టా కిరణ్ కుమార్, కొల్లి ఆంజనేయులు, శీలు బాబూరావు, కళ్యాణం రాంబాబు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.