March 21, 2013

ఈ వ్యవస్థకు గత వైభవం తేవాలి

రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో దొరికింది. నేను కంబాల చెరువు వెళ్లినప్పుడు ఒక ఆడపడుచు వ్యక్తం చేసిన ఆవేదన నేటి ఏలికల తీరును ఎండగట్టింది. "రాష్ట్రంలో అసలు పాలన అనేది ఉంటే... పాలకులు సమర్థులైతే నేను ఈరోజు నడిరోడ్డు పైకి వచ్చి మీకు మొర పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు'' అని ఆ మహిళ వాపోయింది.

ఇంతకంటే ఈ రాష్ట్ర దుస్థితికి నిదర్శనం ఇంకేం కావాలి? ఆ మహిళ ఒక్కరే కాదు.. "ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం, కానీ.. ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది'' అని దారిపొడవునా ఎందరో పేదలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. సామాన్యుల దుస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రాన్ని దోచుకున్నవారు మాత్రం బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రాజభవనాలను తలపించేలా ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఈ పేదలకు వాళ్లు ఒరగబెట్టింది ఇదేనా?

కొందరు విద్యుత్ ఉద్యోగులు గురువారం నన్ను కలిశారు. ఆ శాఖలో మాదిరిగానే వారి ముఖాల్లోనూ వెలుగులు లేవు. ప్రజలపై తమ చేతులతో భారం వేయాల్సి వస్తోందన్న బాధ ఒకవైపు.. తమ బతుకులు సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న వ్యథ మరోవైపు వారిలో కనిపించింది. "ఈ దుర్మార్గ పాలనలో మేం నిమిత్త మాత్రులం. మా సమస్యలకే అతీగతీ లేదు'' అని వారు నాతో చెప్పుకొని గుండెల్లో భారాన్ని దించుకున్నారు. వీరందరినీ చూశాక నాకు అనిపించింది ఒక్కటే.. 'ఈ వ్యవస్థకు గత వైభవం తేవాలి' అని!