March 21, 2013

గోదారమ్మకు వందనం


రాజమండ్రి : తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షసపాలనలో అందరికీ ఇబ్బందులే. ఓ వైపు కరెంటు ఉండదు. మరో వైపు వేలకు వేలు కరెంటు బిల్లులు. కిరికిరి ముఖ్యమంత్రి పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఇలాంటి పాలన నుంచి మనకు విముక్తి కలగాలంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను పాతాళంలోకి తొక్కాలి. నాకు కాళ్లు నొప్పులు పుడుతున్నాయ్. అయినా మీ అభిమానమే నడిపిస్తోంది. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను.,, అంటూ చంద్రబాబు నాయుడు ఉద్వేగంగా మాట్లాడారు. వస్తున్నా మీ కోసం 170వ రోజు యాత్ర రాజమండ్రిలో 13 కిలోమీటర్ల మేర సాగింది. ఈ యాత్రలో భాగంగా బుధవారం రాత్రి నగరంలో అనేక వర్గాల జనంతో బాబు మమేకమయ్యారు.

కోటిపల్లి బస్టాండ్‌లో వేలసంఖ్య జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఆనందోత్సాహాలతో ప్రసంగం చేశారు. పావుగంట మాట్లాడాలనుకున్న ప్రసంగాన్ని జనం ఉత్సాహాన్ని గమనించి ముప్పావుగంట సేపు ప్రసంగించారు. జనం ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. మీ కష్టాలు నేరుగా చూసి సంఘీభావం తెలపడానికి వచ్చానంటూ అన్నివర్గాల జనాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. పేదల కష్టాలను ఎక్కడిక్కడ ప్రస్తావించడం.. టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని ఏవిదంగా పరిష్కరిస్తారో వివరించి చెప్పడంలో చంద్రబాబు జనాన్ని ఆకట్టుకున్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో అందరికీ ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు.

దొంగల పార్టీ అది: దొంగే దొంగ.. దొంగ అన్నరీతిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. ఎమ్మెల్యేలను కొంటున్నారు. నీచరాజకీయాలు నడుపుతున్నారు. జైలుకె ళ్లి ఆ పార్టీలో కలుస్తారా? ఎంత దారుణం? అని చంద్రబాబు ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ హయాంలో దోచుకున్న సొమ్మును రికవరీ చేసి పేదలకు పంచుతామన్నారు. త్వరలో పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లో కలిసిపోతుందని చంద్రబాబు జోశ్యం చెప్పారు.

అల్లుడా మజాకా: బ్రదర్ అనిల్ పేరుకు మతగురువు. చేసేది దోపిడీ.. అని చంద్రబాబు ఆరోపించారు. అనిల్ అక్రమాలకు అంతులేదన్నారు.పులివెందుల రాజకీయాలు రాష్ట్రంలో చేయాలంటే కుదరదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రౌడీలు, గూండాలను ఏరిపారేస్తామన్నారు.

మురళీమోహన్‌ని గెలిపిస్తే... పేదలకు సేవచేస్తున్న మురళీమోహన్‌ని గెలిపించి ఉంటే రాజమండ్రికి మేలు జరిగేదని చంద్రబాబు అన్నారు. పేద విద్యార్థులకు ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్న మురళీమోహన్‌ని చంద్రబాబు అభినందించారు. అలాంటి మంచి మనిషిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

బాబు వెంట నేతల పరుగులు: చంద్రబాబు పాదయాత్రలో పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గరికపాటి మోహనరావు, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, గన్ని కృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు. కిలోమీటరు కూడా నడకుండానే చాలామంది నేతలు వాహనాలు ఎక్కేశారు.

పసుపు మయం: చంద్రబాబు పాదయాత్రలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు వేలాదిమంది బాబు వెంట నడిచారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్, కోటగుమ్మం, దేవీచౌక్, నం దం గనిరాజు జంక్షన్, ఏవీఏ రోడ్, దానవాయిపేట, టి నగర్, కంబాలచెరువు తదితర ప్రాంతాలు జెండాలతో పసుపుమయమయ్యాయి. నగరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, మాదిగ దండోర డప్పులు.ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.