March 21, 2013

కాళ్లు అరిగినా తృప్తి మిగిలింది

157 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర. అలుపెరగని కష్టం. జనం అభిమానం ముందు చంద్రబాబు జిల్లాలో పన్నెండు రోజులు పడిన కష్టం పార్టీకి కలిసొచ్చింది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్లో కసి పెంచింది. నాయకుల కాళ్లు అరిగేలా చేసింది. రాబోయే ఎన్నికలకు ఈ పాదయాత్ర తొలి శ్రీకారం చుట్టింది. జనం సమస్యలు తెలిశాయి. వారిలో పార్టీని గెలిపించాలన్న కాంక్ష బయటపడింది. ఇతర పార్టీలపై ఉన్న అసంతృప్తి రహస్యం బట్టబయలైంది. గత కొద్దికాలంగా టీడీపీలో ఒక నిరుత్సాహకర వాతావరణం బాబు పాదయాత్రతో కొంతలో కొంతైనా తొలగింది. పార్టీ అధినేతే స్వయంగా పాదయాత్ర చేస్తుండటంతో ఆయనను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కన్వీనర్లు, సీనియర్ నాయకులకు కూడా పని తగిలింది.

ఉదయం, అర్ధరాత్రి ఎమ్మెల్యేలు, కన్వీనర్లకు చంద్రబాబు హాజరు వేశారు. దీంతో తప్పించుకోలేని వీళ్లంతా కాళ్లరిగేలా ఆయన వెంటే నడిచారు. సుమా రు 157 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో పార్టీ ముఖ్యులంతా నిరంతరం కొనసాగారు. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, శివరామరాజు, టీవీ రామారావు, చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లు అనుసరించారు. వయసు పైబడినా ఖాతరు చేయకుండా డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, డాక్టర్ బాబ్జీ కూడా ఆది నుంచి తుది వరకు బాబు వెంటే ప్రయాణించారు. మోకాళ్లు ఇబ్బంది పెడుతున్నా తణుకు కన్వీనర్ వై.టి. రాజా పాదయాత్రలో ఆసాంతం కొనసాగారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పీతల సుజాత, మేఘలాదేవి, సరళాదేవి, డాక్టర్ రాజ్యలక్ష్మి, రాధ వంటి మహిళా నేతలు ఎక్కడా వెనకడుగు వేయలేదు.

బహుదూరపు బాటసారి బాబునే అనుసరించారు. పార్టీ కన్వీనర్లు గాదిరాజు బాబు, ముళ్లపూడి బాపిరాజు, గన్ని వీరాంజనేయులు, శ్రీరాములు, అంబికా కృష్ణ, ముడియం శ్రీనివాస్ తదితరులంతా కాళ్లకు పనిచెప్పారు. అధినేత పాదయాత్ర చేస్తున్న మార్గంలో వీరంతా రోడ్డుకు ఇరువైపులా ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మందిని సమన్వయ పరిచారు. వీరు బాబుకు చేరువయ్యేలా పన్నెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకు శ్రమిస్తూనే వచ్చారు. వీళ్లంతా ఒక ఎత్తయితే పార్టీ సీనియర్ నేతలు పాలి ప్రసాద్, జగదీష్‌బాబు, నాయుడు రామచంద్రరావు, పాకలపాటి గాంధీ, ఏపూరి దాలయ్య, బడేటి బుజ్జి, కొక్కిరిగడ్డ జయరాజు, వీరవాసరం దాసు వంటి వారు అధినేతను అనుసరించిన వారిలో ఉన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే వీరందరిలోనూ ఎన్నికల ఉత్సాహం కన్పించింది. చంద్రబాబు పాదయాత్ర పార్టీలో యువతలో ఉత్తేజం రేకెత్తించింది. నియోజకవర్గాల సమీక్షల్లో పార్టీ నేతల పనితీరు కూడా బట్టబయలైంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇప్పుడే స్థితిలో ఉందో కార్యకర్తలే స్వయంగా పార్టీ ర్రాష్ట అధ్యక్షుడి దృష్టికి నేరుగా తీసుకువెళ్లారు. కొన్ని సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖారారు చేసే విషయంలో జాప్యం వద్దంటూ కీలక సూచనలు అధిష్టానం ముందుంచారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న లుకలుకలు కార్యకర్తల నోట విన్న చంద్రబాబు ఆయా నియోజకవర్గాల కన్వీనర్లకు చురకలు అంటించారు. పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగడం ఒక ఎత్తయితే ప్రజల నుంచి వచ్చిన మద్దతు సహజంగానే పార్టీ నేతలందరికీ పూర్తి సంతృప్తినే ఇచ్చింది. పార్టీకి మంచి రోజులు వచ్చాయన్న సంకేతాలనిచ్చింది. నాయకుల్లో ఉన్న నిరుత్సాహం స్థానంలో చురుకుదనం పుట్టించింది. దీనికి తోడు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనడం కూడా పార్టీకి శుభసంకేతంగా భావిస్తున్నారు.