March 21, 2013

జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటే జేబుదొంగలవుతారు

బ్రాహ్మణుల కోసం నిధి
వారికి చట్టసభల్లోనూ పదవులిస్తాం
తూర్పు పాదయాత్రలో చంద్రబాబు హామీలు
ప్రజా కోర్టులో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను చిత్తు చేయండి
యువతకు టీడీపీ అధినేత పిలుపు

 రాజమండ్రి: యువతే మనదేశానికి బలమని, అటువంటి శక్తివంతమైన యువత అవినీతిపై పోరాటం చేయాలని టీడీ పీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకప్పుడు సమాజాన్ని శాసించిన బ్రాహ్మణులు ఇవాళ అన్ని విధాలుగా వెనుకబడిపోయారని వారికి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 'వస్తున్నా మీకోసం' అంటూ ఆయన చేపట్టిన పాదయాత్ర తూ ర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా గురువా రం ఆయన పలు చోట్ల ఉద్వేగభరిత ప్రసంగాలు చేశారు.

ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి అవినీతి ఆటంకంగా మారిందని, యువత.. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, ఫూలే, ఎన్టీ రామారావు వంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఒక రుగ్మతగా మారిన అవినీతిపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కిరికిరి సీఎం కిరణ్ రాజీవ్ యువ కిరణాల పేరిట కోటి ఉద్యోగాలు ఇస్తున్నానని కోతలు కోస్తున్నారని విమర్శించారు. కిళ్లీ షాపులు, కాఫీ హోటళ్లు, బట్టల కొట్లు మద్యం దుకాణాలు, ప్రైవేట్ కంపెనీల్లో చేరిన వారందరి జాబితా తయారుచేసి వీరందరికి తానే ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నారని, ఇదంతా ఓ ఫార్స్ అని చంద్రబాబు విమర్శించారు.

తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం తెచ్చిన ఎన్టీ రామారావు కుగ్రామమైన నిమ్మకూరులో పుట్టి సైకిల్ మీద వెళ్లి చదువుకుని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించారని, అక్కడ అవినీతిని చూసి భరించలేక రాజీనామా చేశారన్నారు. తరువాత సినిమారంగంలోను, రాజకీయాల్లోను తనదైన ముద్రను వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తన వద్ద పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎన్నికల ప్రధాన అధికారులుగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌లుగా ఎదిగితే వైఎస్ వద్ద పనిచేసిన వారు జైలుపాలయ్యారని చెప్పారు.

ఇంకా సచివాలయంలో కొందరు దొంగలు ఉన్నారని వాళ్లు కూడా జైలుకు పోతే సచివాలయం ఖాళీ అయిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దోపిడీ చేసిన రాజశేఖరరెడ్డి కొడుకు జైలు పాలయ్యాడని అతనికి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై పోరాటం చేసి.. పిల్ల, తల్లి కాంగ్రెస్‌లను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టి చిత్తుగా ఓడించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. వైఎస్ అల్లుడు మత గురువు ముసుగులో దోపిడీ చేస్తున్నాడని, బావమరిది ఎర్రచందనం స్మగ్లింగ్, కల్తీ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడని ఇటువంటి వారి మాటలు నమ్మితే యువతకు శిక్షణ ఇచ్చి జేబు దొంగలుగా తయారుచేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇవాళ యువ నా యకత్వం ఎంతైనా అవసరముందని 33 శాతం సీట్లు యువకులకే ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. పలు బ్రాహ్మణ సంఘాలు కోరుతున్న విధంగా బ్రాహ్మణ నిధి ఏర్పాటు, పూజారుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచే విషయం ఆలోచిస్తానని, అగ్రకుల పేద విద్యార్థులందరికి వసతి గృహ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. రాజమండ్రిలో ఆయన పాదయాత్రకు అనూహ్యస్పందన లభించింది. మహిళలు హారతులు ఇవ్వగా,యువత నీరాజనం పట్టారు.

విశాఖలో వచ్చే నెల 20నపాదయాత్ర ముగింపు

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను వచ్చే నెల 20న విశాఖలో ముగించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.