March 19, 2013

అనిల్ ప్రచారకుడు కాదు..అవినీతిపరుడు

ఇది భ్రమల బడ్జెట్!
భరోసా ఇవ్వడం పోయి..భయపెడుతున్నారు
'పశ్చిమ'యాత్రలో చంద్రబాబు నిప్పులు

ఏలూరు : "రైతులను ఆదుకోలేరుగానీ వ్యవసాయానికి ముసాయిదా పేపరు విడుదల చేస్తారట. ఎవరిక్కావాలి వాళ్ల పేపరు? చేస్తే రైతులకు మేలు చేయండి.. జిమ్మిక్కులు కాదు'' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుపై కాంగ్రెస్‌కు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో, వారిని ఎలా మోసం చేస్తున్నాదో సోమవారం అసెంబ్లీలో పెట్టిన వ్యవసాయ విధాన పత్రం చూస్తే అర్థమవుతోందని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చంద్రవరం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మల్లవరం, గౌరిపల్లె, పసివెదల, నందమూరు, కొవ్వూరు పొలిమేర వరకు నడిచారు. దారిపొడవునా జనసమూహాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

యాత్రలో భాగంగా ఆయన చంద్రవరంలో దళిత కుటుంబాలను కలుసుకున్నారు. అనంతరం పాల్గొన్న పలు సభల్లో బడ్జెట్‌పై భగ్గుమన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. భ్రమలో పెడుతున్నదని చంద్రబాబు దుయ్యబట్టారు. " వ్యవసాయం ఇప్పటికే దెబ్బతింది. రైతులు అప్పులపాలయ్యారు. వీటి నుంచి ఎలా గట్టెక్కిస్తారో చెప్పలేదు గానీ ముసాయిదా పేపర్లతో హంగామా చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఏ పనీరాదు. ఎలా చేయాలో అంతకంటే తెలియదు. ఫోజులు మాత్రం కొడతారు'' అని తీవ్రంగా మండిపడ్డారు. కావాలని కష్టాలను కొనితెచ్చుకోవద్దని ప్రజలకు హితవు పలికారు.

" పాలిచ్చే గేదెకు కాక, దున్నపోతుకు గడ్డిపెట్టి మీరు ఇప్పటికే నష్టపోయారు. ఇక ముందు ఇలాంటి కష్టాలు రాకుండా చూసుకోండి. నాకు సహకరించండి''అని విజ్ఞప్తి చేశారు. తల్లి కాంగ్రెస్ (కాంగ్రెస్), పిల్ల కాంగ్రెస్ (వైసీపీ)లు ర్రాష్టాన్ని నిండా ముంచాయని ఆరోపించారు. బ్రదర్ అనిల్ మత ప్రచారకుడు కాదు.. అవినీతి నాయకుడని అభివర్ణించారు. ఇప్పుడు ర్రాష్టంలో ఎవరైనా పులివెందుల వెళ్లి తిరిగి రాగలరా.. ఇలాంటి పరిస్థితి మరే నియోజకవర్గంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. అంతకుముందు పోలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్న ఎన్నికల కోసం పూర్తిగా అంకితం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 'మీకు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాను. ఇంట్లో కాపురం లేదు. అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పార్టీ గెలుపు కోసం పోరాటానికి సంసిద్ధమవ్వాలి' అని ఆదేశించారు. కాగా, జిల్లాలో బుధవారంతో పాదయాత్ర ముగుస్తోంది. బుధవారం సాయంత్రం కొవ్వూరు రైల్వే కం రోడ్డు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరిలోని రాజమండ్రిలో అడుగిడనున్నారు. జిల్లాలో 13 రోజులపాటు యాత్ర సాగుతుంది.