March 19, 2013

23న బాలయ్య రాక

అనకాపల్లి: సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈనెల 23న పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుగుదేశం పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అంకంపేట చేరుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కుమారపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తారని తెలిపారు.

బాబు పాదయాత్ర 13 రోజులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' నినాదంతో చేపట్టిన పాదయాత్ర జిల్లాలో 13 రోజులపాటు సాగుతుందని రత్నాకర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నాతవరం మండలంలో విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి నందివొంపు, గండి జంక్షన్, అగ్రహారం, దొండవాక, మల్లవరం, కొత్తపల్లి, పాములవాక, జల్లూరు, ఎండపల్లి, పీపీ అగ్రహారం, మాకవరపాలెం, పాతకన్నూరుపాలెం, కన్నూరుపాలెం, జి.భీమవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, సోమవరం, గణపర్తి, చూచుకొండ, జగన్నాథపురం, మల్లవరం, ఉప్పవరం, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక, నాగులాపల్లి మీదుగా అనకాపల్లి చేరుకుంటారని చెప్పారు.

పట్టణంలో మెయిన్‌రోడ్డు మీదుగా బైపాస్‌రోడ్డుకు చేరుకొని మునగపాక మండలంలోని గవర్ల అనకాపల్లి, తోటాడ, సిరసపల్లి, పరవాడ, దేశపాత్రునిపాలెం నుంచి విశాఖ నగర పరిధిలోకి ప్రవేశిస్తారని చెప్పారు. కూర్మనపాలెం, గాజువాక, షీలానగర్, ఎన్ఏడీ కొత్తరోడ్డు, కంచరపాలెం, పూర్ణామార్కెట్, ఆరిలోవ, శొంఠ్యాం నుంచి అలమండ మీదుగా విజయనగరం జిల్లాకు వెళతారని చెప్పారు. చంద్రబాబు గతంలో రైతుపోరుబాట కార్యక్రమం నిర్వహించినప్పుడు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పర్యటించినందున ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పాదయాత్ర జరపడం లేదని రత్నాకర్ చెప్పారు.

పాయకరావుపేటలో స్వాగతం

చంద్రబాబుకు పాయకరావుపేటలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలుకుతారని ఆయన తెలిపారు. తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుతోపాటు జిల్లాలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, బొడ్డపాటి చినరాజారావు, పాకలపాటి పెదబాబు, మళ్ల రాజా, బొడ్డేడ శంకరరావు, మళ్ల సురేంద్ర, బొలిశెట్టి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, మద్దాల వెంకటరమణ, నిమ్మదల సత్యనారాయణ, దొడ్డి బుద్ద సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.