March 19, 2013

మీ సేవకుడిని .. ఆశీర్వదించండి

  ఏలూరు:అడుగడుగునా హామీల వర్షం.. ఏం చేస్తానో, ఏం చేయబోతానో ఒక నిర్ధిష్ట విధానంతో హామీలు.. సందేహాలకు జవాబులు, నిక్కచ్చిగా ఉంటానంటూ హామీ.. ఉద్యోగులు తనతో కలిసి రావాలని పిలుపు.. అన్ని వర్గాలకు చేరువయ్యే తపన.. ఇవన్నీ కలబోసి జిల్లాలో చంద్రబాబు బుధవారం నాటికి 130 కిలోమీటర్ల మైలురాయిని అలవోకగా అధిగమించనున్నారు. ఒకవైపు కాళ్ల నొప్పులు, శారీరక బాధలు ఆయనను ఈ పదకొండు రోజులు వెన్నాడాయి. అడుగు తీసి అడుగు వేసేందుకు ఒక్కోరోజు పంటి బిగువున బాధ అనుభవిస్తూనే పాదయాత్రను మాత్రం ఎక్కడా ఆపలేదు. చంద్రబాబు ఇప్పడే కొత్తగా తమ ఊరికి వచ్చారనేటట్లుగా ఊళ్లకు ఊళ్లే జనంతో పోటెత్తాయి. తెలుగుదేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నాయి. ఉత్సాహం ఉరకలెత్తింది.

చంద్రబాబులో చలాకీతనం కన్పించింది. మనవి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను అనే పాత మాట ఇప్పుడీ పాదయాత్రలో మచ్చుకైనా బాబు నోట వెంట రాలేదు. స్పష్టమైన వాగ్దానాలు, చేయాల్సింది విస్పష్టంగా చెప్పడం, చెప్పింది అర్థమైందా లేదా అని తిరిగి ప్రజల నుంచే సమాధానాలు రాబట్టే దిశగానే ఆయన పాదయాత్ర ఆసాంతం ఉత్సాహంగా సాగింది. కరెంటు బిల్లులు, కరెంటు కోతలు ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. కరెంటు ఇచ్చే సత్తా ఏదైనా ఉంటే అది మీకే చెల్లు అని ప్రజల నుంచే ఆయన నేరుగా మద్దతు దక్కించుకోవడంలో కొంత సఫలీకృతమయ్యారు.

ప్రజల కష్టాలను ఏకరవు పెట్టడం, వారి నోటే ఎలా తిప్పలుపడుతున్నారో తెలుసుకోవడానికే ఆయ న ప్రాధాన్యత ఇచ్చారు. యువకులు మహిళలే కాదు, ముసలీ ముతకా భుజం తట్టారు. వెన్ను నిమిరి 'మనం అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి కష్టాలు ఉండవ'ని ధైర్యాన్ని నూరిపోయడం ఆయన యాత్ర అడుగడుగునా కొనసాగింది. ఇప్పటికే ఆయన అలసి సొలసి.. కాళ్లు నొప్పులతో ఇబ్బందులు పడుతున్న వైనాన్ని పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ, బహిరంగ సమావేశాల్లోనూ విడమర్చి చెప్పడం ద్వారా తాను ఎంతగా శ్రమిస్తుందీ కార్యకర్తల ఎదుట ఉంచగలిగారు.

ఫలితంగా అన్ని వర్గాల్లోనూ ఆయన పట్ల సానుభూతి కాస్తంత పెరిగినట్టు కన్పించింది. ఈ వయసులోనూ ఆయన కష్టాలను తట్టుకుని ముందుకు సాగుతున్నారన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యాయి. రుణమాఫీ హామీ బాబు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణ కలిగిన వా గ్దానం. దీనినే ఆయన అన్ని చోట్లా ప్రస్తావించారు. ఇంతకుముందు రుణ మాఫీ జరిగినప్పుడు ముందుగానే రుణం కట్టినవారు నష్టపోయారు, కానీ ఈసారి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం ద్వారా మరికొంత అదనపు మద్దతు దక్కించుకునే ప్రయత్నం చేశారు. బీసీలపైనా వంద సీట్ల ప్రభావం కన్పించింది.

ఎస్సీ వర్గీకరణ ఒక ఎత్తయితే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న బాబు వాగ్దానం మరికొంతమందిని మురిపించింది. అగ్రవర్ణాలు ఈ హామీ పట్ల కొంత మేర దృష్టి పెట్టినట్లు కన్పించింది. కార్యకర్తల సమావేశాల్లో పార్టీ ఏ స్థాయిలో ఉందో అసలు గుట్టు కూడా చంద్రబాబు స్వయంగా తెలుసుకోవడానికి వీలుపడింది. నియోజకవర్గాల వారీగా ఉన్న బలం, బలహీనతలు కూడా ఆయనకు స్పష్టంగా తెలిసేటట్లు చేశాయి. ఆయన పాదయాత్ర సాగిన సుమారు 70 గ్రామాల్లో అన్నిచోట్లా ప్రజాదరణే. మహిళలు, యువకులు, రైతులు ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారో అలాగే చంద్రబాబుకు అనేక చోట్ల చేరువయ్యేందుకు చేసిన ప్రయత్నం సహజంగానే చంద్రబాబుతో పాటు టీడీపీ వర్గాలను కూడా సంతృప్తిపరిచాయి. ఇంకోవైపు ఆచంట వంటి నియోజకవర్గాలను మినహాయిస్తే మిగతా అన్నింటిలోనూ పార్టీ నేతలు పడిన కష్టం పాదయాత్ర విజయానికి దోహదపడింది. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే చంద్రబాబు ఈసారి పాదయాత్రలో కొంతమారినట్లు గమనించారన్న వ్యాఖ్యలు కార్యకర్తల నోట వి న్పించాయి. ఆయన తన సహజ ధోరణికి భిన్నంగా అనేక చోట్ల ఛలోక్తులు విసరడమే కాక తనపై పాత ఆరోపణలను ఎవరైనా ప్రస్తావించినప్పుడు ఉగ్రరూపాన్ని కూడా ప్రదర్శించారు. అధికార కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలు, ఆరోపణలు దండిగా సంధించారు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని సాధారణ, మధ్యతరగతి కు టుంబాలకు విడమర్చి చెప్పారు. అలాగే టీడీపీకి డబ్బు లేదని, మీరే ఎకరాను, అర ఎకరాను అమ్మి అయినా పార్టీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు తొలిసారిగా పిలుపు ఇచ్చారు. పనిచేసేవాళ్లను గుర్తిస్తాం, లేదంటే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమని తన పార్టీ వారికి పాదయాత్రలో వార్నింగ్‌లు ఇచ్చారు. డ్వాక్రా మహిళల మద్దతు కూడగట్టుకోవడానికి ఇక మీకు భవిష్యత్‌లో పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇస్తామని భరోసా కల్పించడం ద్వారా వేలాది గ్రూపుల్లో ఓ కొత్త చర్చకు తెరలేపారు.