March 19, 2013

అమ్మ మాటే నాకు బాట!

అమ్మ గుర్తుకొచ్చింది. సాగు నుంచి కుటుంబ సాగరం దాకా ఓపిగ్గా ఈదిన కష్టజీవి ఆమె. పనిచేయడం తప్ప పడుకొని ఉండటం నేను చూడలేదు. ఆమె జీవితమే నాకు ఆదర్శం. ఆమె కష్టాన్ని చూసిన తరువాతే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. శరీరం సహకరించకపోయినా, కదలబోమని కాళ్లు మొరాయించినా ఇప్పుడిలా ప్రజల మధ్య నిలబడి ఉన్నానంటే.. ఆ శక్తి నాకు అమ్మ పంచినదే. నాలోనే దాచేసుకున్న 'అమ్మ' జ్ఞాపకాల తేనెపుట్టెను చంద్రవరం పార్టీ సమావేశంలో ఆ మిత్రుడు కదిలించాడు.

కాలి నొప్పో, మరో బాధో అయితే తట్టుకోవచ్చు.. కానీ, అమ్మ గుర్తొస్తే.. నిభాయించుకోవడం ఎలా? 'చేతనైతే పదిమందిని ఆదుకోవాలి. మన కష్టం మాత్రం ఎప్పుడూ చెప్పుకోకూడదు నాయనా.. కడుపులోది కడుపులోనే దాచుకోవాలి' అనే ఆమె మాటలు ఎప్పుడు గుర్తొచ్చినా ఇప్పుడే వింటున్నట్టుంటుంది. ఇంటికి పెద్ద కొడుకుగా నా బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజలను అంటిపెట్టుకొని ఉంటున్నాను. ఈ బాటలో మా అమ్మ మాటే బాసట!

"నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనీయను'.. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ నిద్రకు పడినప్పుడు నేనిచ్చిన నినాదమిది. అది అప్పటి అవసరం. కానీ, అవే మాటలు చంద్రవరంలో వినిపించి ముచ్చటేసింది. "మీ హయాంలో మా గ్రామం నుంచి 30 మంది విదేశాలకు వెళ్లారు. ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ అలాంటి రోజు ఒకటి రావాలి. దానికోసం మీరు తిరిగి సీఎం కావాలి. అంతవరకూ మేం నిద్రపోం. మిమ్మల్నీ నిద్రపోనీయం'' అని ఆ వ్యక్తి అంటుంటే ముఖంలో పట్టుదల తొణికిసలాడింది. ఇలాంటి వ్యక్తులను మనం తయారుచేస్తే..వారే ఈ వ్యవస్థను మారుస్తారు!