March 19, 2013

ఏప్రిల్ 20న విశాఖలో బాబు జన్మదిన వేడుకలు

వస్తున్నా..మీకోసం' పాదయాత్రను
ఏప్రిల్ 19న ముగించనున్న చంద్రబాబు
కదిలించిన గరికపాటి ప్రసంగం
ఉద్వేగానికి లోనైన చంద్రబాబు నాయుడు

ప.గో : 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రను ఏప్రిల్ 19 న ముగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు. మిగిలిన ఆరు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదిన ప్రారంభమైంది. ఆయన పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. చంద్రబాబు పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కాగా మంగళవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు పోలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీకి చెందిన సీనియర్ నేత గరికపాటి రామ్మోహన రావు కార్యకర్తలకు బాబు పాదయాత్ర కష్టాలు ఏకరువు పెట్టారు. ఎంత కష్టంగా ఉన్నప్పటికి బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆయన కష్టాలను తాము కళ్లారా చూస్తున్నామని, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు తల్లి బతికి ఉండి ఉంటే ఆయన పాదయాత్రను చూసి కన్నీళ్లు పెట్టేదని అన్నారు.

అరవై నాలుగేళ్ల వయస్సులో చంద్రబాబు సాహసం చేస్తున్నారని, ఆయన ఎవరి కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారో ప్రజలు, కార్యకర్తలు గుర్తించాలని గరికపాటి రామ్మోహన రావు అన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. అయినా, ఆయన ప్రజల కోసం ఇదంతా చేస్తున్నారన్నారు. గరికపాటి మాటలు కార్యకర్తలను, నేతలను ఉద్వేగానికి గురి చేశాయి. వేదిక పైనున్న చంద్రబాబు కూడా గరికపాటి మాటలకు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరగడం చూసిన కార్యకర్తలు మరింత ఉద్వేగానికి గురయ్యారు.