March 19, 2013

బాబు రూటు మారింది

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 'మీకోసం పాదయాత్ర'లో మళ్లీ మార్పులు, చేర్పులు జరిగాయి. సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి, ఆయన అనుచరులు, నగర, రూరల్ అధ్యక్షులు సోమవారం అధినేత రూట్‌మ్యాప్‌పై సమావేశమయ్యారు. ఆదివారం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు హాజరైన సమన్వయ సమావేశానికి బండారు, ఆయన అనుచరులు హాజరుకాని విషయం తెలిసిందే.

ఒక వర్గం సమావేశానికి తానెందుకు హాజరవుతానంటూ ఆయన పార్టీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అర్బన్, రూరల్ పార్టీల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. తాజాగా ప్రతిపాదించిన రూట్‌లో పెందుర్తిని మినహాయించి గాజువాకను చేర్చారు. ఇంకా మరికొన్ని మార్పులు చేశారు.

నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జి భరణికాన రామారావు, గాజువాకకు చెందిన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, హర్షవర్దన్‌ప్రసాద్, గుడివాడ అమర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రతిపాదించిన షెడ్యూల్‌లో పాయకరావుపేట నియోజకవర్గం లేదు.

చంద్రబాబు తుని నియోజకవర్గం కోటనందూరు నుంచి విశాఖ జిల్లాలోకి నాతవరం మండలం గన్నవరం గ్రామం వద్ద అడుగుపెడతారు. నాతవరం మండలం నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్ర పాములపాక, బాపిరాజు కొత్తపల్లి, గిడుతూరు, మాకవరపాలెం, తాళ్లపాలెం, చూచుకొండ, మునగపాక, అనకాపల్లి, సబ్బవరం వరకూ సాగుతుంది. అక్కడి నుంచి వెదుళ్లనరవ మీదుగా దువ్వాడ, గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, పూర్ణామార్కెట్, జగదాంబ, మద్దిలపాలెం మీదుగా హనుమంతువాక చేరుతుంది.

భీమునిపట్నం నియోజకవర్గంలో ఇంకా రూట్ ఖరారు చేయలేదు. చంద్రబాబు జిల్లాలో మొత్తం 13 రోజుల పాటు పాదయాత్ర చేస్తారని తాజా షెడ్యూల్‌లో పొందుపరిచారు. అయితే రూట్‌లో ఇంకా మార్పులు చేర్పులు వుంటాయని నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో కీలక ప్రాంతంలో బహిరంగ సభలు ఏర్పాటుచేస్తారు.