March 19, 2013

కొవ్వూరులో కదం తొక్కారు


 ఏలూరు:జిల్లాలో పదకొండు రోజుల సుదీర్ఘ పాదయాత్ర.. ఆది నుంచి చివరి దాకా తెలుగుదేశం అధినేతకు అన్నిచోట్లా నీరాజనాలే. వస్తున్నా మీకోసం అం టూ తమ గ్రామాల్లో అడుగిడుతున్న చంద్రబాబుకు రోడ్లపై పూలుపరచి పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలంటూ దీవెనలు ఇస్తున్నారు. పదకొండు రోజుల్లో నిర్విరామంగా ఆయన కాలు నొప్పిపెడుతున్నా ఖాత రు చేయకుండా బుధవారం నాటికి జిల్లాలో 130వ మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఉప్పుటేరు నుంచి కొవ్వూరు దాకా అన్నిచోట్లా జనమే. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా బాబు ప్రయాణించే మార్గంలో పూలు పరిచి మరీ, ఆయనపై తమకున్న అభిమానాన్ని పశ్చిమ జిల్లా వాసులు లోకానికి చాటే ప్రయత్నం చేశారు.

పాదయాత్రలో బాబుకు దీవెనలు అందించేవారు కొందరు, తమ డిమాండ్లను వినిపించేవారు ఇంకొందరు, మిమ్మల్ని సీఎం చేస్తామంటూ భరోసా ఇచ్చేవారు ఇంకొందరు, కరెంటు కష్టాలు తొలగించాలంటూ గోడు వెళ్లబోసుకుంటున్న ఇంకొందరు ఇలా బహుదూరపు బాటసారికి అన్నిచోట్లా ఎదురయ్యారు. ఒక ఇంటి పెద్ద ఎదుట కష్టసుఖాలు ఎలా చెప్పుకుంటారో సరిగ్గా అలాగే చంద్రబాబుతో కూడా గ్రామాల్లో ప్రజలు బాధలు చెప్పుకున్నారు. 'ర్రాష్టానికి ఒక పెద్దన్నయ్య మీ ముందుకు వస్తున్నా'ఆశీర్వదించండి అంటూ చేతులు జోడించి బాబు చేస్తున్న విజ్ఞప్తికి మీదే గెలుపు అంటూ వేల గొంతుకులు నినదించాయి. బడి పిల్లల దగ్గర నుంచి మహిళలు సైతం బాబుకు చేరువగా వెళ్లి దీవెనలు అందించేందుకు పోటీలు పడ్డారు. ఉండి, భీమవరం, పాలకొల్లు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు వంటి అన్ని నియోజకవర్గాల మీదుగా సాగిన ఆయన పాదయాత్ర అట్టహాసంగానే సాగింది. మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా సాగుతున్న ఈ యాత్రలో తనతో నడిచి వస్తున్న వందలాది మందిని గమనించి బాబు కూడా ఉత్సాహపడ్డారు. నలుగురిలో కలిసిపోయారు. భుజం తట్టి ఏమేమి కష్టాలుపడుతున్నారంటూ ఆరా తీశారు. 'చంద్రబాబు నిన్ను చూడాలని వచ్చానయ్యా' అంటూ దగ్గరకు వచ్చి పండుముదుసళ్లను ఆయన అక్కున చేర్చుకున్నారు. 'ఏం పర్వాలేదు, మీకండగా నేనుంటాన'ంటూ శిరస్సు నిమిరి భరోసా ఇచ్చారు. 'ఉద్యోగాలు లేవు సార్' అంటూ యువకులు గొంతెత్తి ఆవేదన వ్యక్తం చేస్తుంటే 'మీకూ మంచి కాలం వస్తుంది, మన పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాను, అది ఎలా చేస్తానో మీరే చూస్తారుగా' అంటూ యువకులను ప్రోత్సహించారు.

మహిళలు అన్నిచోట్లా మంగళహారతులు పడుతూనే మీరు మళ్లీ అధికారంలోకి రావాలంటూ దీవెనలు అందించారు. ఇక ముందు మా వంతు కూడా పార్టీని గెలిపించుకోవడానికి, మిమ్మల్ని సీఎం చేసేందుకు అన్ని విధాలా మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని, తోటి ఆడపడుచులుగా బాబుకు సంఘీభావం ప్రకటించారు. కొవ్వూరు నియోజకవర్గంలో రెండ వ రోజైన మంగళవారం కూడా యాత్ర కొనసాగుతున్నప్పుడు చంద్రవరం నుంచి కొవ్వూరు వరకు దారి పొడవునా చంద్రబాబుపై అభిమానం ఉప్పొంగింది. వేలాది మంది ఆయనను చూసేందుకు అన్నిచోట్లా ఎగబడ్డారు. బాబు కూడా ఉత్సాహంగా, చొరవగా అన్ని వర్గాలకు చేరువయ్యా రు. కరెంటు సమస్యలను ప్రస్తావిస్తూనే చేతకాని ప్రభుత్వం వల్ల ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. మీకు ఈ కష్టాలు పోవాలంటే తెలుగుదేశంను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను గుచ్చిగుచ్చి చెప్పారు. చంద్రవరం, గౌరిపల్లి, నందమూరు, పసివేదల వంటి గ్రామాల్లో స్థానికులు వీధుల్లోకి ఓ జనప్రవాహంలా వచ్చా రు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాం తం ఆలకిస్తూనే తమ కష్టాలను కూడా వెళ్లబోసుకున్నారు. 'ఎస్సీల వర్గీకరణను సమర్ధిస్తూ మీరు అన్ని వర్గాలకు ఏదో సాయం చేస్తున్నారు, దీనిని మేము సమర్ధిస్తాం. మీరు ధైర్యంగా ముందుకు సాగండి' అంటూ గ్రామ పొలిమేరల వరకు వెన్నంటే నడుస్తూ వచ్చారు. దళిత వర్గాలను కూడా చంద్రబాబు కలుసుకుని వారి కష్టసుఖాలను ఆలకించారు. ఎమ్మెల్యే టీవీ రామారావు, మురళీమోహన్, సీతారామలక్ష్మి, గరికిపాటి మోహనరావు వంటి వారు వెంట ఉండగా ఆయన దాదాపు అన్నిచోట్లా కూడా తాను ప్రసంగిస్తూనే ఎదుటి వారికి కూడా కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించారు. పశ్చిమలో పదకొండో రోజు జరిగిన పాదయాత్రకు అపూర్వ స్పందన, విశేష ఆదరణ తోడయ్యాయి. చంద్రబాబు సైతం ఈ మేర కు ఉత్సాహంగా కన్పించారు. ఆయన కొన్ని సభల్లో ఛలోక్తులు విసిరి ప్రజలను నవ్వులతో ముంచెత్తేలా వ్యవహరించారు. కాంగ్రెస్ దొంగలను ఓడిస్తేనే ర్రాష్టానికి మోక్షం లభిస్తుందం టూ జన సమూహాలకు హితవు పలికారు. దారిపొడవునా ఆయన తన కోసం వేచి ఉన్న వృద్ధుల దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు. 'ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా బతుకుతున్నార'ంటూ యోగక్షేమాలను అడుగుతూ, ఆ వర్గాలకు కూడా మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటిన ఆయన అలసటను కూడా ఖాతరుచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తూ వచ్చారు.