February 13, 2013

టీడీపీ అనుకూల గాలులపై శ్రేణులకు బాబు పిలుపు

ఈ చర్చను పల్లెలకు చేర్చండి

"తొమ్మిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం సమర్థవంతమైన పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్థ పరిపాలనపై డిబేట్ ప్రారంభమైంది. ఈ చర్చను మారుమూల పల్లెలకూ విస్తరింపజేయండి'' అని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ్ఖగుంటూరు పట్టణంలో తాను బస చేసిన ప్రాంతం నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర బాధ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నేతలను ఆయన అభినందించారు. సభ్యత్వ నమోదు నుంచి ఎన్నికల వరకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పించినప్పటికీ తెలుగుదేశం పార్టీ తన పట్టును నిరూపించుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. పాదయాత్ర తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి 'పల్లెపల్లెకు తెలుగుదేశం' కార్యక్రమాన్ని పునప్రారంభించాలని పిలుపునిచ్చారు.

మండలికి పట్టభద్రుల నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తున్న చిగురుపాటి వరప్రసాద్, కాసుమిల్లి వెంకటసూర్యనారాయణ (చినబాబు), జే. చంద్రశేఖర్ గెలుపుకోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. ఈ నెల 19, 21, 23, 25 తేదీల్లో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లోని వివిధ డిస్కంల పరిధుల్లో నిర్వహించే పబ్లిక్ హియరింగ్‌లకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కో ఆర్డినేటర్లు పార్టీ శ్రేణులతో కలిసి హాజరు కావాలని కోరారు.