February 13, 2013

అవినీతి సొమ్ముతో వైఎస్సార్‌సీపీ పుట్టింది

జర్నలిస్టులపై టీడీపీ ఎప్పుడూ దాడి చేయలేదు
టీడీపీ లక్ష్యంగా సాక్షి మీడియా పనిచేస్తోంది
దాడుల చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానిదే : రేవంత్‌రెడ్డి

జర్నలిస్టులపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దాడులు చేయలేదని, జర్నలిస్టులంటే తమకెంతో గౌరవమని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో సాక్షి కార్యాలయంకై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. నాలుగేళ్లుగా సాక్షి పత్రిక చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా రాసినా టిడిపి ఎప్పుడూ దాడి చేయలేదన్నారు. దాడుల చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా బుధవారం టీడీపీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాక్షి దిన పత్రిక పుట్టుకే అవినీతి, అబద్దాల పుట్టుక అన్నారు. ప్రతిరోజు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. టీడీపీ లక్ష్యంగా సాక్షి మీడియా పని చేస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా చేయలేదని, జగన్ అనుచరులే ధర్నా చేశారని రేవంత్ చెప్పారు.

గుంటూరులో సాక్షి కార్యాలయం నుండి తమ పార్టీ నేతలపై జగన్ పార్టీ కార్యకర్తల రాళ్ల దాడి, గుడ్ల దాడికి ప్రతిస్పందనగానే అది జరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమనుకుంటే ఈ ఘటనపై విచారణ చేపట్టాలన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు పత్రికలు చదువొద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. షర్మిల, అంబటి రాంబాబులకు తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తమ తీరు కుసంస్కారం అని షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కుసంస్కారం అంటే ఏమిటో ఆమె చెప్పాలన్నారు. 35 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని విమర్శించడం, కెసిఆర్, టిడిపి నేతలను కాళ్లు పట్టుకోమని అడగడం, అవినీతికి పాల్పడ్డ జగన్‌ను జైలు నుండి విడిపించుకునేందుకు తమ పార్టీపై బురద జల్లడం, ఆపరేషన్ పైన నివృత్తి చేయాలని అడిగితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కుసంస్కారం కాదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

జర్నలిస్టులు జగన్ కోసం పని చేయడం మానుకోవాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. సాక్షిది అబద్దాల పుట్టుకని, అవినీతి సొమ్ముతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఆయన ఆరోపించారు. కలర్ ఫుల్ పేజీలతో అందరికంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పిన జగన్ రెండు రూపాయల నుండి ఇప్పుడు నాలుగు రూపాయలు చేశారన్నారు. అవినీతి జగన్‌ను బయటకు తీసుకు వచ్చేందుకు తప్పుడు రాతలు, అబద్దాలు రాస్తోందన్నారు. సాక్షిలో పని చేసే జర్నలిస్టులు చిల్లరమల్లర పనులు చేయవద్దని హితవు పలికారు. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆంధ్రజ్యోతి దిన పత్రిక కార్యాలయాలపై దాడి చేసిన సంస్కృతి వైఎస్సార్‌సీపీదేనని రేంత్‌రెడ్డి అన్నారు.