February 13, 2013

తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి కాంగ్రెస్ చెదలు

'ర్రాష్టానికి అవినీతి చెదులు పట్టింది. అది ర్రాష్టాన్ని తినేస్తోంది. కిరికిరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెదులును వదిలించాల్సిందిపోయి దానిని పెంచడంలో బిజీగా ఉన్నాడు. మీరు కూడా మాకేమి పోయిందని అనుకోవద్దు. పోయేదంతా మీదే. మీరు కట్టే పన్నులు మీ సంక్షేమం కోసం కాకుండా కాంగ్రెస్, వైసీపీ దొంగల జేబుల్లోకి వెళుతున్నాయనేది గమనించాలని' తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

చంద్రబాబు తన ఆరో రోజు పాదయాత్రలో ప్రధానంగా గుంటూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ప్రసంగాలు చేశారు. డీఎస్ నగర్, బండ్లబజార్ కూడలి, ఎన్‌టీఆర్ ఐలాండ్ వద్ద చేసిన ప్రసంగాల్లో అందరికి అర్థమయ్యే రీతిలో అవినీతి గురించి వివరించారు. 'అవినీతి వలన ప్రజలు నష్టపోయారు. ఏదో ఒక విధంగా బాధపడుతున్నారు. కేంద్రం నుంచి రూ. 12 వేల కోట్లు పట్టణాల అభివృద్ధికి వస్తే వాటిల్లో చాలావరకు పనులు చేయకుండా కాంగ్రెస్ దొంగలు దోచేశారని' ఆరోపించారు. వైఎస్ హయాం నుంచి దీనికి బీజం పడిందని, జలయజ్ఞంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 26 వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులపై చర్యలు తీసుకొని ప్రక్షాళన చేయాల్సిందిపోయి సీఎం కిరణ్ దొంగలను కాపాడేందుకు సుప్రీంకోర్టులో వారికి ప్రభుత్వపరంగా డబ్బులు పెట్టి న్యాయసాయం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు దోచుకొన్న రూ. లక్ష కోట్లతో కోటి మంది పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించ వచ్చని, అలానే రైతులకు ఐదు సార్లు రుణమాఫీ చేయవచ్చని పునరుద్ఘాటించారు.

తాను 30 ఏళ్లు పాటు పెంచి పోషించిన కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాసం లేకుండా వైసీపీ సూట్‌కేసులు, ప్యాకేజ్‌లకు అమ్ముడుపోతున్నారన్నారు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు వెల్లడించారు. '2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పార్టీ పెట్టాడు. వెంటనే సర్వే చేయించి ఒక్క పులివెందులు, కుప్పం తక్క మిగతా 292 సీట్లు తమవేనన్నాడు. తీరా ఎన్నికల్లో 16 సీట్లు మాత్రమే గెలిచాడు.. ఆ రోజున చిరంజీవి పార్టీ లేకపోతే టీడీపీనే అధికారంలోకి వచ్చి ఉండేది. అదే తరహాలో జగన్ ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా సీఎం కుర్చీ, దోచుకొన్న రూ. లక్ష కోట్లను కాపాడుకొనేందుకు పిల్ల కాంగ్రెస్‌ను పెట్టాడు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడా నిలబడలేదు. రేపటి రోజును ఏ రెండో, మూడో సీట్లు వస్తే దానిని తన కేసులు మాఫీ చేసేందుకు ఉపయోగించుకొంటాడే తప్పా అతను ప్రజాసేవ చేయడని. అలాంటి పార్టీకి ఓటేయొద్దని' ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బండ్లబజార్‌లో ఒక వ్యక్తి మీకు సింగపూర్‌లో హోటల్ ఉందని అంటున్నారని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఉద్రేకంగా ప్రసంగించారు. మంచికి చెడుకు, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య తేడా తెలియకపోతే వాడు మనిషి కాదు. పశువు కంటే హీనమని చెబుతూ ప్రజలు కొన్ని సందర్భాల్లో మోసం చేయవచ్చని, అన్ని సార్లు మోసం చేయలేరని చెప్పారు. వైఎస్ కుటుంబం తనపై అసత్య ప్రచారం చేస్తూ నీతిమాలినదని దుమ్మెత్తిపోశారు.

వ్యాట్ వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వస్త్ర వ్యాపారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన సమస్యపై సానుకూలంగా స్పందించారు. వ్యాట్‌ను ఎత్తివేయమని పోరాడితే 5 శాతం నుంచి నాలుగు శాతానికి కాంగ్రెస్ పార్టీ తగ్గించిందని, తాము అధికారంలోకి రాగానే పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. వ్యాపారాలు చేసి పది మందికి సహాయపడే వైశ్యులు రాజకీయాల్లోకి వస్తే తాను ప్రోత్సహిస్తానన్నారు. తాము అంబికా కృష్ణ, సిద్ధా రాఘవరావు, తాతబ్బాయి తదితర నేతలను ప్రోత్సహాన్ని అందించామని, వారు రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారని చెప్పారు.

రైతుబజార్లు పెట్టి

'నిత్యవసరాల'ను నియంత్రించా
..

తాను సీఎంగా ఉన్న సమయంలో రైతుబజార్లను ఏర్పాటు చేసి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించానని చంద్రబాబు చెప్పారు. అయితే కాంగ్రెస్ దొంగలు అంతకంటే బాగా చేస్తామని చెబితే మీరు నమ్మారు. మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ బియ్యాన్ని రూ. 15 నుంచి రూ. 50కి, ఉల్లిపాయలను రూ. 4 నుంచి రూ. 40కి, ఉప్పును రూ. 2 నుంచి రూ. 10కి చేర్చి నడ్డి విరిచారని చెప్పారు. అదే 2009లో ఇప్పుడు చూపిస్తోన్న కసి చూపించి ఉంటే కాంగ్రెస్ పీడ విరగడై కష్టాలు పోయేవన్నారు. మీరు పడుతోన్న కష్టానికి మంచి ప్రభుత్వమైతే 50 శాతం ఆదాయం చూపించి ఉండేదని, చెత్త కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయేలా చేస్తోందని విమర్శించారు.