February 13, 2013

చంద్రబాబుకు బ్రహ్మరథం

పెదకాకాని: వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా తక్కెళ్ళపాడు బైపాస్ వద్దకు వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. తక్కెళ్ళపాడు రామచంద్రపాలెం, గ్రామాల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు చంద్రన్నకు హారతులిచ్చారు. నందివెలుగు రోడ్డు గుండా తక్కెళ్ళపాడు బైపాస్, సిబార్ కాలేజి, ఉప్పలపాడులోని గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. అడుగడుగునా పూలు చల్లి, బాబుకు స్వాగతం పలికారు. నందివెలుగు రోడ్డు మొత్తం జనసంద్రంగా మారింది. తక్కెళ్ళపాడు బైపాస్ వద్ద నుంచి ఉప్పలపాడు వరకు 'దేశం' కార్యకర్తలు, మహిళలు, అభిమానులు బారులు తీరారు.

తమ ప్రియతమ నేత చంద్రబాబు రాక కోసం గంటలతరబడి రోడ్డు పక్కన వేచి ఉన్నారు. విశేషంగా తరలివచ్చిన మహిళలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. మీ కష్టాలు తీరుస్తానంటూ వారికి భరోసా ఇచ్చారు. తక్కెళ్ళపాడు బైపాస్ వద్ద పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. టీడీపీ నాయకులు వెలినేని శ్రీనివాసరావు (బాబు), గోగినేని అమరేంద్ర, మల్లికార్జునరావు తదితరులు బాబు వెంట నడిచారు. నందివెలుగు రోడ్డు పూర్తిగా జనంతో నిండిపోయింది.

తక్కెళ్ళపాడు, ఉప్పలపాడులో చంద్రబాబు పర్యటన విజయవంతంగా సాగింది. భారీ స్థాయిలో తరలివచ్చిన కార్యకర్తల మధ్య చంద్రబాబు అడుగులు వేశారు. చంద్రబాబు ప్రసంగంలో అధ్యంతం ఎన్టీ రామారావు పేరును ఉచ్చరించడం, తక్కెళ్ళపాడులో ఎన్టీఆర్ ఉన్నట్లు అప్పటి స్మృతులను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.