February 13, 2013

మే' దాకా నడవడమే..

బాబు యాత్రపై పార్టీ వర్గాల విశ్లేషణ

చంద్రబాబు పాదయాత్ర మరో మూడునెలలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీ నాటికి గుంటూరు జిల్లాలో యాత్ర పూర్తి కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 19వ తేదీ సాయంత్రం నుంచి 21వ తేదీ సాయంత్రం వరకూ యాత్రకు విరామం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఆ జిల్లాలో ఆయన రెండు రోజులు అదనంగా ఉంటున్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రెండో దఫా అడుగు పెడతారు.

ఈ విడతలో సుమారు పది రోజులు అక్కడ పాదయాత్ర చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన కనీసం పాతిక రోజులు ఉంటుంది. ఏప్రిల్ ఐదో తేదీ నా టికి ఈ జిల్లాలను పూర్తి చేసుకొని ఉత్తరాంధ్రలో అడుగు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో జిల్లాకు పది రోజులు వేసుకొన్నా మూడు జిల్లాలు పూర్తి కావడానికి నెల పడుతుందని, ఈ లెక్కన మే నెల మొదటి వారానికిగాని యాత్ర పూర్తి కాదని అంటున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఈసారి బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఢిల్లీలో ప్రకంపనలు: లోకేశ్
పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీలో వినిపిస్తున్నాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. రైతులకు రుణ మాఫీ గురించి కేంద్రం ఆలోచన చేస్తోందని కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ చేసిన ప్రకటనపై ట్విటర్‌లో ప్రతిస్పందించారు. "పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి కాగానే చంద్రబాబు గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన నగదు బదిలీ పధకాన్ని కాపీ కొట్టి ఒక చెత్త నగదు బదిలీ పధకాన్ని ప్రకటించారు. రెండు వేల కిలోమీటర్లు పూర్తి కాగానే రుణ మాఫీ ప్రకటన గురించి విన్నాం. పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీకి తగులుతున్నాయా?' అని వ్యాఖ్యానించారు.