February 13, 2013

నగర టీడీపీలో సమరోత్సాహం నింపిన బోనబోయిన

తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు. పార్టీ నగర నాయకులందరిని ఒక తాటి పైకి తీసుకొచ్చి చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టేలా తన సత్తాను చాటారు. ఎన్‌టీఆర్ కాలనీలో చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటూ ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు నివేదించారు. డివిజన్ స్థాయిలో కార్యకర్తలు మొదలుకొని నాయకుల వరకు ప్రతీ ఒక్కరిని చంద్రబాబుకు పరిచయం చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు.

నగరమంతటా భారీ ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేయించి పసుపు పరవళ్లు తొక్కేలా చేశారు. చంద్రబాబు పాదయాత్రకు రాష్ట్రంలో మరెక్కడా రానంతగా జనం హాజరయ్యేలా చేసేందుకు నెల ముందు నుంచే బోనబోయిన కసరత్తు ప్రారంభించి, ప్రణాళికలు అమలు చేశారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్ ఎం జియావుద్దీన్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యాగంటి దుర్గారావును సమన్వయం చేసుకొని పలుమార్లు డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా గ్రూపులకు తావివ్వకుండా అందరూ అధినేత పర్యటనలో కలిసి పాల్గొనేలా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర జరిగిన తీరు చూసి చంద్రబాబే ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్... కీపిట్ అప్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించడం విశేషం. టీడీపీ నగర అధ్యక్ష బాధ్యతలను మూడు నెలల క్రితమే చేపట్టిన బోనబోయిన పార్టీ శ్రేణుల్లో గూడుకట్టుకొని పోయి ఉన్న నిరాశ, నిస్పృహ, నిస్తేజాన్ని పారద్రోలి పూర్వవైభవం తీసుకురావడం కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చంద్రబాబు పాదయాత్రను నగరంలో విజయవంతం చేసిన బోనబోయినను పార్టీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు తదితరులు అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. బీసీలకు 100 సీట్లు కేటాయిస్తానని చంద్రబాబు హామి ఇచ్చిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో అవకాశం లభించ వచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.