February 13, 2013

యాతనల బతుకుల్లోకి యాత్రగా..!

పాదయాత్రలో మరో మైలురాయి దాటాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మజిలీలు లేవు. అడుగులోనే ఆనందం వెతుక్కున్నాను. నడకలోనే నా వాళ్లను కలుసుకున్నాను. పాదపాదాన ప్రజల దీవెనలు పొందాను. యాత్ర అంతటా యాతనల బతుకు ఈడుస్తున్న బడుగుల కన్నీటి మడుగులో తడిశాను. నేనూ కన్నీళ్లు పెట్టాను. నేనూ గాయపడ్డాను. నేనూ భుజం కోసం వెతుక్కున్నాను. ఎర్రన్నాయుడు లేని లోటు మరింతగా బాధిస్తోందిప్పుడు. హిందూపురంలో ఉత్సాహంగా పడిన ఎర్రన్న అడుగు, చివరిదాకా అండగా ఉంటుందనుకున్నాను.

ఆయన ఊరికి నా పాదయాత్ర వెళితే.. ఎవరు ఎదురొస్తారు? గుంటూరు పట్టణంలో యుగపురుషుడు ఎన్టీఆర్ విగ్రహం సమక్షంలో 2000 కిలో మీటర్ల నడక పూర్తి చేసుకోవడం నా అదృష్టం. ఆయన స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై నా యాత్ర నిర్విఘ్నంగా సాగుతోంది. అవినీతి సమస్యపై ప్రజల్లో గొప్ప చైతన్యం రగిలించింది. ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతోనే అడుగేస్తున్నాను.

ఇక్కడ కోటీశ్వరులను చూశాను. ఒక రోజు కూలికి పోకపోతే పస్తులుండాల్సిన పేదల బతుకూ చూశాను. పేద, ధనికుల మధ్య ఇంతటి వ్యత్యాసమా? ఇది క్షేమం కాదు. ఒక్క ఈ పట్టణంలోనే వందకుపైగా మురికివాడలున్నాయి. వాటి రూపురేఖలు మారాలి. పట్నం బజారు గుండా పోతున్నప్పుడు చిరు వ్యాపారుల చింతలు విన్నాను. పొద్దున్నే నిద్ర లేచిన దగ్గరనుంచికనిపించిన దేవుడికల్లా మొక్కుకుంటున్నారట.

రకరకాల అనుమతుల పేరుతో తమను వేధింపులకు గురిచేయకుండా చూడాలని కోరుకోని రోజు లేదట. "ఒక చిన్న వ్యాపారం చేసుకునేందుకు ఇన్ని అనుమతులు అవసరమా సార్..?''. వాళ్లడిగిన ఈ ప్రశ్న అర్థవంతమైనదే అనిపించింది. కార్లలోనో, హెలికాప్టర్లలోనో వచ్చి హామీలిచ్చిన వాళ్లను చూశారు. గాయపడ్డ పాదాలతో నడిచొచ్చిన నన్నూ చూశారు. ఇక ముందూ నా ధీమా ఇదే!