February 13, 2013

కాంగ్రెస్ పాలన వల్ల ఇరవై ఏళ్లు వెనక్కి పోయాం

మీ సమస్యల ముందు నా సమస్య లెక్క కాదు
ఉపాధిహామీ పేరుతో కోట్లు స్వాహా : చంద్రబాబు నాయుడు

జీవితంలో ఎప్పుడూ ఆరోగ్య సమస్య రాలేదని, కొత్తగా బీపీ, ఇతర సమస్యలు వస్తున్నాయని, అయితే మీ సమస్యల ముందు తన సమస్య లెక్క కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమీ లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో గెలిచినా మళ్లీ సీఎంనే అవుతానని బాబు చెప్పారు.

బుధవారం ఉదయం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు నుంచి చంద్రబాబు నాయుడు 135 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపాయారని, ఇప్పుడు ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందన్నాయని, కాంగ్రెస్ పాలన వల్ల మనం ఇరవై ఏళ్లు వెనక్కి పోయామని చంద్రబాబు విమర్శించారు.

ఉపాధి హామీ పేరుతో కాంగ్రెస్ నేతలు కోట్లు స్వాహా చేశారని, సాగునీటి సంఘాల ఎన్నిక ల పేరుతో రూ.900 కోట్లు తిన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతులు, ప్రజల ఆలోచన విధానాల్లో మార్పురావాలని ఆయన కోరారు. కాగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడిని చలపతి విద్యాసంస్థల అధినేత ఆంజనేయులు, విద్యార్థులు బుధవారం ఉదయం కలుసుకున్నారు. బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు విద్యార్థులు స్వీట్లు తినిపించారు. అనంతరం చంద్రబాబుకు ఆంజనేయులు రూ.5.20 లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు చంద్ర బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.