September 3, 2013

ఆత్మగౌరవ యాత్రలో బాబుకు నీరాజనం

చంద్రబాబు గుంటూరు జిల్లాలో కొనసాగిస్తోన్న ఆత్మగౌరవయాత్రకు జనం విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర కొనసాగగా మంగళవారం నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ నియోజకవర్గంలోకి క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు వేలాది మంది ప్రజలు హాజరై చంద్రబాబుకు నీరాజనాలు పట్టారు. తమ్ముళ్లూ... అంటూ ఆయన హావభావాలతో చేసిన ప్రసంగాలకు ప్రజలు విక్టరీ సింబల్ చూపిస్తూ హర్షధ్వానాలు చేశారు.

ముఖ్యంగా తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం యుగపురుషుడు ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని అన్నప్పుడు కేరింతలు కొట్టారు. అలానే వైఎస్, జగన్, సోనియా, ప్రధానిమంత్రిపై విమర్శలు చేసినప్పుడు మరింతగా కేరింతలు కొట్టారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన రెంటపాళ్ల గ్రామానికి చెందిన నేలవల్లి నేతాజీ బొమ్మను వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు గరికపాటి మోహన్‌రావు, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నన్నపనేని రాజకుమారి ఉన్నారు.