September 3, 2013

తెలుగుజాతికి ఎప్పుడూ విక్టరీనే సీఎం, బొత్స ఉత్తరకుమారులు ప్రధాని తోలుబొమ్మ : బాబు

మొన్న 'వస్తున్నా, మీకోసం' పాదయాత్ర చేసినప్పుడు మీరంతా కష్టాల్లో ఉన్నారు. అప్పుడు నేను విక్టరీ గుర్తు చూపించలేదు. ఈ రోజు మీరు రోడ్డెక్కి పోరాడుతా ఉన్నారు. ఈ రోజు విక్టరీ సింబల్ చూపిస్తున్నా. అంతిమంగా తెలుగుజాతిదే విజయమేనని చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.


మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామం నుంచి చంద్రబాబు మూడో రోజు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించి పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట తదితర గ్రామాల్లో ప్రసంగించారు. మిమ్మల్ని ఇంత ఇబ్బందికి గురి చేసిన సోనియాగాంధీ కనిపిస్తే మీరు వదిలి పెట్టేలా లేరు. ఇది కసిగా, కక్షగా మారి ముందుకుపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మీ పొట్టలు కొడుతోంది. ఇటలి నుంచి వచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బ తీస్తోంది. సోనియా అదృష్టం కొద్ది గాంధీ కుటుంబంలో చేరారు. అంతా ఆమెకు కలిసొచ్చింది. రాజీవ్‌గాంధీ చనిపోవడంతో దొడ్డిదారిన అధికారం చెలాయిస్తోంది తప్పా తెలివితేటలతో కాదని స్పష్టం చేశారు.

సీఎం, బొత్స ఉత్తరకుమారులు

ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స ఉత్తరకుమారుల్లా వ్యవహరిస్తున్నారు. కిరణ్ రాజకీయ కోమాలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తోన్న సీమాంధ్రులపై వైజాగ్‌లో తన అనుచరులతో దాడి చేయించారు. ఈ చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బొత్స కబడ్దార్ జాగ్రత్తగా ఉండు. నిన్ను వదిలిపెట్టమని నిప్పులు చెరిగారు.

ప్రధాని తోలుబొమ్మ

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తోలుబొమ్మలా సోనియా ఎలా ఆడితే అలా ఆడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ బతికుంటే ఆయన ఐదేళ్ల సీఎం కొనసాగించిన దోపిడీలో ప్రధాన ముద్దాయి అవుతారని ఒకపక్క సీబీఐ చెబుతోంది. మరోవైపు వైఎస్ బతికుంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కావని ప్రధాని అంటుండటం సిగ్గు చేటన్నారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని నిత్యవసర సరుకుల ధరలను వెయ్యి శాతం పెంచేశారు.

ఇదే కాంగ్రెస్ కొనసాగితే సంచి నిండా డబ్బులు తీసుకెళ్లినా కనీసం జేబు నిండా సరుకులు తెచ్చుకొనే పరిస్థితి ఉండదన్నారు. సీమాంధ్ర ఎంపీలపై చంద్రబాబు తన ఆరోపణల పరంపరను కొనసాగించారు. వాళ్లు చేతకాని దద్దమ్మలు. మంత్రి పదవుల కోసం ఆశపడి సోనియా విసరిన ఎముకలను కొరుకుతూ కూర్చున్నారని మండిపడ్డారు. వీళ్లకు వ్యక్తిత్వం లేదు. ఉంటే సోనియాపై పోరాడండని డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే ప్రజలు రెచ్చిపోతారు. మీకు చేతకాకపోతే దిగిపోండి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సమస్య పరిష్కారం చేసి చూపిస్తానని చంద్రబాబు సవాలు విసిరారు.