September 3, 2013

సీమాంధ్ర ఆందోళనలు పట్టించుకోరా?


విదర్భ గురించి షిండే మాట్లాడ్డంలేదు
గతంలో నాపైనా దాడి చేయించారు
టీడీపీ వస్తే సమస్య పరిష్కరిస్తా : బాబు


ప్రత్యేక తెలంగాణపై 20 రోజుల్లో కేబినెట్ నోట్ పెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్నారు, మరి సీమాంధ్ర ఆందోళనలు పట్టించుకోరా అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడో రోజైన మంగళవారం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, రెంటపాలెంలో చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. జిల్లాలోని రెంటపాళెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో వీరయ్యచౌదరి విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై మాట్లాడుతున్న సుశీల్ కుమార్ షిండే విదర్భ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నోట్ పెట్టే ముందు విభజన సమస్యల గురించి ఆలోచించరా అని ఆయన ప్రశ్నించారు. సాగు, తాగునీరు రావని, ఉద్యోగాలు దొరకవని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి అవినీతిమయం చేశారని, ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పెట్టిన ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణం వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు.
విజయనగరంలో గతంలో తనపై కూడా దాడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు. విజయనగరంలో దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. బొత్స కుటుంబ సభ్యులందరికీ పదవులు ఉన్నాయని, యువత ఉద్యోగాలు రావని బాధపడుతున్నారని, ఈ బాధలు బొత్సకు పట్టవా అని చంద్రబాబు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలుగువారికి ఎప్పుడు కష్టం వచ్చినా తమ పార్టీ అండగా నిలిచిందని, ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే పోటీ తప్ప మరెవరూ కారని ఆయన అన్నారు. తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఇటలీలో పుట్టినందు వల్ల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చరిత్ర తెలియదని అన్నారు.
రాజకీయాల కోసం కాంగ్రెసు పార్టీ తెలుగువారి మధ్య చిచ్చు పెట్టిందని, తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటుందోని చంద్రబాబు మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలని, తన మీద మొరుగుతారే కానీ, సోనియాని అడగలేరని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తామని మరోసారి చంద్రబాబు తెలిపారు.