September 3, 2013

ప్రజాందోళనలు విస్మరించి 'నోట్‌' పెడతారా?


షిండే వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర నిరసన!
విదర్భ, యుపిపై లేని తొందర ఇక్కడే ఎందుకు?

రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో నెలరోజులుగా ప్రజాందోళనలు జరుగుతుంటే, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి 20 రోజుల్లో మంత్రివర్గం ముందు 'నోట్‌' ప్రవేశపెడతానని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంటే పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నారు. చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర' మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరు, అచ్చంపేట, రెంటపాళ్ళ, పీసపాడు, వేల్పూరు గ్రామాల్లో సాగింది. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలో విదర్భ, యుపిలో మరో నాలుగు రాష్ట్రాలు చేస్తామని ఎన్నికలకు ముందు వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ, వాటి గురించి పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణా విషయంలో మాత్రమే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ లభ్ధి కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టడం క్షమించరాని నేరమన్నారు. యుపిఎ ప్రభుత్వం 35 సార్లు పెట్రోల్‌, 25 సార్లు డీజిల్‌ ధరలను పెంచిందని, 50 సంవత్సరాల పూర్వం ఉన్న ధరలకంటే గత తొమ్మిదేళ్లలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెట్టింపయ్యాయన్నారు. గుంభనంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లను భూస్థాపితం చేస్తేనే తెలుగువారి ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, దానికి ఊపిరిపోయే రోజులు దగ్గర పడ్డాయనీ అన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే బతుకులు చితికే పరిస్థితి ఉన్నందున వాస్తవాలను గుర్తెరిగి మసలుకోవాలని ప్రజలను కోరారు.