September 3, 2013

షర్మిల యాత్రపై మండిపడ్డ వర్ల రామయ్య


జగన్ సోదరి షర్మిల 'సమైక్య శంఖారావం' పేరుతో తలపెట్టిన బస్సు యాత్ర.. కాంగ్రెస్‌లో విలీన ఆర్తనాదమని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. జగన్‌ను బయటకు తీసుకు రావాలన్న లక్ష్యంతోనే సోదరి షర్మిల బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. జగన్ బెయిల్ కోసం ఆడుతున్న నాటకంలో భాగంగా ఢిల్లీకి తెలియచెప్పాలన్న ఉద్దేశ్యంతోనే షర్మిల తన తండ్రి సమకాలీనుకుడైన చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని ఏకవచన ప్రయోగంతో బస్సు యాత్రలో విమర్శలు చేస్తోందన్నారు. 13 జిల్లాల సీమాంధ్ర ప్రజలకు చేస్తున్న పనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం ఆరు రోజుల దీక్షకే నిమ్స్‌లో జగన్‌కు అన్ని రోజులు ట్రీట్‌మెంట్ ఎలా ఇస్తారని, అక్కడి వైద్యులు మరింత రెస్ట్ కావాలని చెబుతున్నారని, ఎంతకి అమ్ముడు పోయారని నిమ్స్ డాక్టర్లను ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూలై 31 న దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. సోనియా గాంధీ దానిని పూర్తి చేశారని చెప్పారన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణా తీర్మానానికి 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, అందులో తాను కూడా ఉన్నానని కొండా సురేఖ చెబుతున్న విషయం వాస్తవం కాదా అని షర్మిలను ప్రశ్నించారు. జగన్‌కు అధికార దాహం ఎక్కువని, నమ్మినవాళ్ళను కూడా నట్టేట ముంచుతారని, మరో నాయకుడిని ఎదగనివ్వరని, మాట తప్పటం.. మడమ తిప్పటం జగన్ నైజం అని సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

'మీ నాన్న వైఎస్ 2.75 లక్షల ఎకరాల భూములను పేదల దగ్గర నుంచి లాక్కున్నారు. 3 కోట్ల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశారు. లక్ష కోట్టు దోచుకున్నారు. మై డియర్.. సిస్టర్ ! ఏ మొహం పెట్టుకుని యాత్రకు వస్తున్నారు' అని ప్రశ్నించారు. ఆగస్టు 29, 2011లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలోని కాం గ్రెస్‌కు మద్దతు తెలిపి వ్యవసాయ, రైల్వేశాఖ పదవులను తీసుకుంటామని జగన్ స్వయంగా చెప్పిన విషయం షర్మిలకు గుర్తుకు రాలేదా ? అని ప్రశ్నించారు.

నిమ్స్ డైరెక్టర్లు... ఎంతకు అమ్ముడు పోయారు ?
ఆరు రోజుల పాటు దీక్ష చేసిన జగన్‌ను నిమ్స్‌లో అన్ని రోజుల పాటు చికిత్స చేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. హాస్పిటల్‌కు చలాకీగా నడుస్తూ వచ్చిన జగన్‌కు మరికొంత రెస్ట్ కావాలని నిమ్స్ డాక్టర్లు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లాగా వైవీ సుబ్బారెడ్డి తెల్లకోటు ,సెతస్కోప్, మూతికి గుడ్డ కట్టుకుని జగన్‌ను పరామర్శించటం నిజం కాదా అని ప్రశ్నించారు. నిమ్స్ డాక్టర్లు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.