September 3, 2013

ఆంధ్రానే ఎందుకు చీల్చారు? విదర్భను ఎందుకు విస్మరించారు


బొబ్బిలి పులులై తిరగబడండి
వైకాపాది పూటకోమాట
ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబునాయుడు


 
మహారాష్ట్రలో విదర్భను, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నేతలు గత ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేయకుండానే కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చడంలో ఆంత ర్యం ఏమిటో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రజలకు చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆత్మగౌ రవ యాత్రలో భాగంగా మూడవ రోజున ఆయన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటిం చారు. అచ్చంపేట, క్రోసూరులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ తెలుగుజాతికి ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా సహించే ది లేదన్నారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ వరదల్లో మృతిచెందిన, క్షతగాత్రులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ప్రభు త్వమే లేనట్టుగా వ్యవహరించిందన్నారు. అక్కడ ఇబ్బందులో ఉన్న తెలుగు ప్రజలను రక్షించేందుకు తనతోపాటు పార్టీ శ్రేణులు అహర్నిశలు శ్రమించి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి గమ్యస్థానాలకు చేర్చామన్నారు. తెలుగుజాతి కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం సాగిస్తానన్నారు. 34 రోజులుగా రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రాంతం అట్టుడికి పోతుంటే దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మిన్నకుండటంతోపాటు హోంమంత్రి షిండే రాష్ట్ర విభజనకు సంబంధించి 20 రోజుల్లో క్యాబినేట్‌కు నోట్‌ఫైల్‌ సమర్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. సీమాం ధ్రలో సమస్యను పరిష్కరించకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు దిగుతున్నారంటే తెలుగుజాతి పొట్టకొట్టేందుకేనని చంద్రబాబు విమర్శించారు. దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా మారి కేవలం రబ్బరు స్టాంప్‌గా తయారయ్యారన్నారు.సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ పనికిరాని వాడని ఆయన్ను ప్రధానిని చేసేందుకు రాజకీయ స్వార్థంతో సోనియా రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రపన్నార న్నారు. మరో వైపు తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ పార్టీని విలీనం చేసుకునేందుకు, 2014 ఎన్నికల తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విలీనం చేసుకునేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ పార్టీ చెలగాటమా డుతుందన్నారు. టీడీపీ తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించి ఇప్పటి వరకు తెలుగు జాతి ఔనత్యం కాపాడేందుకు నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలుగుజాతితో పెట్టుకున్న వారెవరైనా చరిత్రహీనులవుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్‌ గాంధీ అవమానించారన్నారు. అందుకు ప్రతిగా ఎన్‌టిఆర్‌ టీడీపీ స్థాపించి అధికారంలోకి వచ్చారన్నారు. 1984లో అన్న ఎన్‌టీ రామారావును ఇందిరాగాంధీ అన్యా యంగా సీఎం పదవి నుంచి భర్తరఫ్‌ చేసిన విషయంలో ఇందిరా గాంధీ మెడలను తెలుగు ప్రజలు వంచారన్నారు.

తన హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల కాలంలో హైదరాబాద్‌తో సహా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్నారు. అనంతరం ప్రస్తుత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందన్నారు. రాష్ట్రం భ్రష్టుపట్టేందుకు కారకులైన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల పనిపట్టేందుకు తెలుగు తమ్ముళ్లంతా బొబ్బిలి పులులై తిరగబడి ఆ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల రూపాయల జాతి సంపదను వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దోచుకున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాం లో రాష్ట్రంలో జరిగిన అవినీతిలో భాగస్వాములైన వారంతా ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో మగ్గుతున్నారన్నారు. వైఎస్‌ కుటుంబ ధనదాహానికి రాష్ట్ర మంత్రులు, పారిశ్రామి కవేత్తలు, ఐఏఎస్‌లు బలయ్యారన్నారు. జగన్‌ బెయిల్‌ , కేసుల మాఫీకై కాంగ్రెస్‌ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర విభజనకు ఆ పార్టీ నాంది పలికిందన్నారు. మరో వైపు వైఎస్‌ విజయమ్మ, జగన్‌లు సమైక్య రాష్ట్రమంటూ దీక్షలు చేస్తూ పూటకో మాట మారుస్తూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. అలాగే తను పాదయాత్ర చేస్తే వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర అంటూ, బస్సుయాత్ర చేస్తే బస్సు యాత్ర అంటూ తన విధానాలను అనుసరిస్తున్నారని, ఆ పార్టీకి ప్రత్యేకంగా అజెండా అంటూ ఏమి లేదని విమర్శించారు.

పులిచింతల

తెదేపా పుణ్యమే


పులిచింతల ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీడీపీ పాలనలోనేనని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వైఎస్‌ అధికా రంలోకి వచ్చి జలయజ్ఞం పేరుతో ఈ ప్రాజెక్టుకు అంచనాలు పెంచి వేల కోట్లు దుర్వినియోగం అయినట్లుగా కాంట్రాక్ట ర్లతో చేతులు కలిపారని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు ఎకరా భూమికి నీరందలేదన్నారు. ఏడా దిన్నర కాలంలో పూర్తి చేస్తామన్న ఈ ప్రాజెక్టు తొమ్మిదేళ్లకు కూడా పూర్తి కాలేదన్నారు.