April 29, 2013

రాష్ట్ర పక్షాళనలో ప్రజల సహకారం కావాలి

రాజేంద్రనగర్: రాష్ట్రంలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని, అది తానొక్కడినే చేయలేనని, ప్రజలందరి సహకారం కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర ముగించుకొని ఆదివారం రాజేంద్రనగర్‌కు చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆరాంఘర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు.

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందజేయగా, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్ గొర్రెను, గొంగడి, గొల్ల రుమాలును బహూకరించారు. గొర్రెను తీసుకున్న చంద్రబాబు ముందు కూర్చున్న నందమూరి బాలకృష్ణకు దాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆరాంఘర్ చౌరస్తాలో చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 208 రోజులు... 2817 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని వస్తున్న తనకు ఆత్మబంధువులు చూపిన స్వాగతం తన జన్మ సార్థకమైనట్లుగా ఉందని చంద్రబాబునాయుడు అన్నారు.

పవ్రిత భావనతో తాను వస్తున్నా మీ కోసం పాదయాత్రను చేపట్టానన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేపట్టిన ఈ యాత్ర ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఎంతో బ్రహ్మాండంగా జరిగిందని, చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ప్రజల అభిమానం అక్కడ కనిపించిందన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు తనకు ఎంతో ఉత్తేజాన్ని నింపి పాదయాత్రకు పంపించారని గుర్తుచేసుకున్నారు. 207 రోజుల పాదయాత్రలో ప్రజల బాధలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోయాయన్నారు.

తాను 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలు పేదవారికి చేరే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అవినీతిలోకి నెట్టివేసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తెలుగుదేశం కృషేనన్నారు. కృష్ణా జలాలను నగరానికి తీసుకువచ్చింది తెలుగుదేశం అని, వాటిని ప్రజలకు సరైనవిధంగా సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేదని, ఉద్యోగాలు లేవని గుర్తుచేశారు. పేదరిక నిర్మూలన జరిగేవరకు తన పోరాటం ఆగదన్నారు.

మొదటి దశ కార్యక్రమంఅయిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగిసిందని, మీ అందరి సహకారంతో పార్టీ శ్రేణులతో మాట్లాడి రెండవ విడత కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతానన్నారు. పాదయాత్రలో నేను బాధపడితే రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందారని, అది చూసి తనకు ఎంతో ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.

ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు సాగుతున్న తనకు ప్రజలు మద్దతు తెలుపాలన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నాయకత్వంలో కాటేదాన్‌లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. వారి పనిగంటలు తగ్గించే విషయంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. పాదయాత్రతో తనకు పట్టుదల పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తనకు భవిష్యత్తులో కూడా ఈ మద్దతును కొనసాగించాలని ఆయన కోరారు.

ఆరాంఘర్ నుంచి శివరాంపల్లి, పీడీపీ చౌరస్తా, ఉప్పర్‌పల్లి మీదుగా హైదర్‌గూడకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు హైదర్‌గూడ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అత్తాపూర్ వద్ద చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించాలనుకోగా మైక్ సహకరించలేదు. దీంతో ఆయన తనకు స్వాగతం పలకడానికి వచ్చినవారిని పలుకరిస్తూ చేయి ఊపుతూ ముందుకు సాగారు.

కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ సర్కిల్ టీడీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు సామ భూపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్‌తో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా ఆలేరు నుంచి వచ్చిన రేణుక ఎల్లమ్మ డోలు బృందం సభ్యులు చేసిన విన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కళాకారులు జంగిరెడ్డి తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పాటలు పాడారు. బాబు రాక సందర్భంగా రాజేంద్రనగర్ రహదారులన్నీ పసుపుమయమయ్యాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు దారి పొడవునా ఏర్పాటు చేశారు. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి పోటీపడ్డారు.

ప్రకాశ్‌గౌడ్‌ను అభినందించిన చంద్రబాబు

కాటేదాన్‌లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా కార్మికులకు 12 గంటల పనిదినాలను 9 గంటలకు తగ్గించిన ఘనత ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కే దక్కుతుందని నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశ్‌గౌడ్ నాయకత్వంలో కాటేదాన్ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాటేదాన్ కార్మికులందరికీ మరింత న్యాయం జరిగేవిధంగా కృషిచేస్తానన్నారు.

బాబుకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే


రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలన్నా, పరిపాలన గాడిలో పడాలన్నా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆరాంఘర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందన్నారు. 9ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు ప్రపంచ దేశాలకు తెలిస్తే కాంగ్రెస్ 9ఏళ్ళ పాలనలో అవినీతి, అక్రమాలతో నిండిపోయిందన్నారు. తెలుగుదేశం ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాటలు నమ్మవద్దన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని గుర్తుచేశారు.

రాజేంద్రనగర్ తెలుగుదేశానిదే: ప్రేమ్‌దాస్


నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ వారి కష్టసుఖాల్లో చంద్రబాబునాయుడు ఏ విధంగా పాలుపంచుకుంటున్నారో అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారని, తిరిగి రాజేంద్రనగర్‌లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని,మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ అన్నారు. చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు స్వచ్చంధంగా ప్రజలు తరలివచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందమూరి బాలకృష్ణ, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్‌తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హైదర్‌గూడలో చంద్రబాబునాయుడుకు బ్రహ్మరథం


ఆరాంఘర్ చౌరస్తానుంచి ఓపెన్ టాప్ జీపులో హైదర్‌గూడకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామేశ్వర్‌రావు నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. అత్తాపూర్ వద్ద ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌తోపాటు కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, నాయకుడు సామ భూపాల్‌రెడ్డి తదితరులు చంద్రబాఋకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

టీడీపీకి పట్టం కట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు..

పహాడిషరీఫ్: 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రను ముగించుకొని నగరానికి వస్తున్న చంద్రబాబుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద స్వాగతం పలికేందుకు టీడీపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తీగల కృష్ణారెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఈరంకి శంకర్‌గౌడ్, సరూర్‌నగర్ మండల బీసీసెల్ అధ్యక్షుడు దూడల సుధాకర్‌గౌడ్‌ల నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. వస్తున్నా... మీకోసం యాత్రను 2012 అక్టోబర్ 2న ప్రారంభించి నేటితో ముగించుకొని నగరానికి తిరిగి వస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి జల్‌పల్లి పరిసర గ్రామాల నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో శం
షాబాద్ విమానాశ్రయంకు బయలుదేరామన్నారు. కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని, దీంతో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

పాతబస్తీ నుంచి టీడీపీీ ర్యాలీ..

చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రక్షాపురం నుంచి టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి నాగు నగేశ్ ఆధ్వర్యంలో పాతబస్తీ నుంచి 100 ద్విచక్ర వాహనాలలో బయలుదేరారు.