April 29, 2013

ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు శ్రీపతి రాజేశ్వర్ మృతి

కిడ్నీవ్యాధితో 'నిమ్స్'లో కన్నుమూత
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు.. ఎన్టీఆర్ వీరాభిమాని
తీరని లోటు : చంద్రబాబు నివాళి

హైదరాబాద్: అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ (73) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ 'నిమ్స్'లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రమీలాదేవి, కూతురు సత్యలక్ష్మి, కుమారులు సతీష్‌కుమార్, సంతోష్‌కుమార్ ఉన్నారు. తండ్రికి వారసుడిగా సతీష్ హైదరాబాద్ పార్టీ శాఖ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఈశ్వరయ్య, రాజమణి దంపతులకు 1944 ఫిబ్రవరి 6న జన్మించిన శ్రీపతి.. బాల్యం నుంచే ఎన్టీఆర్‌కు వీరాభిమాని. దేశంలోనే తొలిసారి 'అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘా'న్ని 1952లో నెలకొల్చారు. ఆ అభిమానంతోనే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా, సభ్యత్వం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే ఇద్దరు ముగ్గురు నేతల్లో శ్రీపతి ఒకరు. 1983లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి గెలిచి.. కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. గృహనిర్మాణం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.

1989 ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత 1999లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో టీఆర్ఎస్‌తో పొత్తులో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గం ఆ పార్టీకి పోవడంతో ఆయన పోటీచేయలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో హుడా, సెట్విన్, చిన్నతరహా పరిశ్రమల సంస్థ, బీసీ వెల్ఫేర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ తదితరుల పదవులు నిర్వహించారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం ఏటా ఆయన వర్ధంతి రోజున 'ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ' నిర్వహిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట శ్మశాన వాటికిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

చంద్రబాబు నివాళి
శ్రీపతి రాజేశ్వర్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో పార్టీకి, నందమూరి కుటుంబానికే కాక, వ్యక్తిగతంగా తనకూ నష్టం కలిగిందని ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువరానివన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సంస్మరణ సభలో ఆ పార్టీ నేతలు తొండపి దశరథ జనార్దన్ రావు, కంభంపాటి రామ్మోహన్ రావు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శ్రీపతి మరణవార్త తెలిసిన వెంటనే వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఆయన స్వగృహానికి తరలివచ్చారు. ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.