April 29, 2013

మరో యాత్ర! ధర్మ పోరాటం కొనసాగిస్తా!


పదవులపై వ్యామోహం లేదు
తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దోపిడీ పార్టీలు
వైఎస్‌పై మేం పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది?
'విజయోత్సవ సభ'లో బాబు నిప్పులు



'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీగా వెళ్తూ... పలుచోట్ల చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి పాలనను అంతమొందించేందుకు రాజీలేని విధంగా ధర్మ పోరాటం చేస్తానని ప్రకటించారు.

"అవినీతి, కుంభకోణాలపై పోరాడే శక్తిని మీరే అందించారు. మీ తరఫున పోరాడతాను. మంచి రోజులు వస్తాయి'' అని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన ఇచ్చేంత వరకు ఈ పోరు సాగిస్తానని తెలిపారు. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సర్వనాశనమైపోయింది. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా మార్చేశారు. నాకు పదవులపై, అధికారంపై వ్యామోహం లేదు. తెలుగు వారికి, రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడమే నా లక్ష్యం. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టి పూర్వవైభవం తీసుకురావడమే మనముందున్న కర్తవ్యం'' అని చంద్రబాబు ప్రకటించారు. "మీ ఆశీస్సులు ఉంటే మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాను. నిద్రపోకుండా పనిచేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను. టీడీపీ సత్తా మళ్లీ చాటిచెబుతాను'' అని తెలిపారు.

ఆ పార్టీలతో జాగ్రత్త... మభ్యపెడుతున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ దోపిడీ పార్టీలైతే టీఆర్ఎస్ ఫామ్‌హౌస్ పార్టీ అని పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని భూములను వైఎస్ తన వారికి ధారాదత్తం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. "బాబ్లీపై మేం పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది? బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడికి కట్టబెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏం చేశారు?'' అని చంద్రబాబు నిలదీశారు.

కాళ్లు మొరాయించినా... ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేసినట్లు చంద్రబాబు తెలిపారు. "శరీరం సహకరించకున్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా ఏడునెలల పాటు 2,800 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశాను. 16 జిల్లాల్లోని దాదాపు 1250 గ్రామాలను తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాను'' అని శంషాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో చెప్పారు. "సుదీర్ఘ యాత్రలో అనేక ఇబ్బందులు, కష్టాలు, శారీరక సమస్యలు ఎదురయ్యాయి. గొంతు పోయింది. కాళ్లు మొరాయించాయి. డాక్టర్లు అడ్డుచెప్పినా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకుసాగాను. పొలాలు, పూరిగుడిసెల్లోకి వెళ్లాను. తినేందుకు తిండిలేక అస్థిపంజరంలా ఉన్న మనుషులనూ చూశాను'' అని చంద్రబాబు ఆవేదనతో చెప్పారు.
రంగారెడ్డి జిల్లా: "పాదయాత్రలో మొదటి అడుగు మాత్రమే నాది. మీ అభిమానం, ఆశీస్సులతోనే మిగిలిన అడుగులు పడ్డాయి. ఇంత దూరం నడిపించాయి'' అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. "అవినీతి పాలనపై మీ ఆశీస్సులు, సహకారంతో ధర్మపోరాటం కొనసాగిస్తాను. మరో యాత్రను ప్రారంభిస్తాను'' అని చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతామన్నారు.