April 29, 2013

వ్యాట్ తొలటింపులోమతలబు: టీడీపీ

వస్త్రాలపై వ్యాట్ తొలగింపునకు ఏడాదినుంచీ వ్యాపారులు, ప్రతిపక్షాలు పోరాడినా పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్, ఆకస్మికంగా రద్దుకు నిర్ణయించడం వెనుక మతలబు ఉందని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు దీనిపై విచారణ జరిపించాలని సోమవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. వ్యాట్ తొలగించాలన్న వ్యాపారుల డిమాండ్ న్యాయమైనదేనని, తమ పార్టీ అధినేత చంద్రబాబుసహా ప్రతిపక్షాలన్నీ వారి ఆందోళనకు మద్దతు ప్రకటించాయని గుర్తుచేశారు.

అటుపైన మంత్రివర్గ సమావేశాల్లో సహచరుల విజ్ఞప్తి నేపథ్యంలో నాలుగు శాతం తగ్గించి, పూర్తిగా రద్దుచేసేది లేదని చెప్పారన్నారు. అప్పుడు కూడా రూ.50 కోట్లు చేతులు మారినట్లు సాక్షాత్తూ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఆరోపించారంటూ పత్రికల వార్తలనూ చూపారు. తాజాగా సీఎం సోదరుడు సంతోష్‌కుమార్‌రెడ్డి వ్యాపారుల లాబీతో కుదుర్చుకొన్న ఒప్పందంలో భాగంగా పూర్తిగా రద్దు చేశారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.

దీంతోపాటు సీఎం నియోజకవర్గం పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కుటుంబసభ్యుల సహకారం ఉండటంవల్లనే అధికారులు ఆ స్మగ్లర్ల జోలికి వెళ్లడంలేదని ఆరోపించారు. ఇక చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభ విశేషాలు పత్రికల్లో ప్రముఖంగా రాకుండా చూడటానికే సర్కారు పెద్దపెద్ద తొలిపేజీ ప్రకటనలిచ్చిందని విమర్శించారు.

యాభై పైసలు కూడా ఇవ్వలేదు: టెక్స్‌టైల్ ఫెడరేషన్ వస్త్రాలపై వ్యాట్‌ను ప్రభుత్వం రద్దు చేయడంపై ఎ.పి.ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్, మల్లీశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం సోదరుడు రూ.50 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపణలను వారు తోసిపుచ్చారు. "రూ.50 కోట్లు కాదుకదా... యాభై పైసలు కూడా ఇవ్వలేదు'' అని స్పష్టం చేశారు. సీఎంను మే 5న సన్మానించాలని నిర్ణయించామని ప్రకటించారు.