April 29, 2013

నెల రోజులే గడువు వృద్ధులు, వితంతు పెన్షన్లు పెంచాలి


లేదంటే సమరమే
ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం పెట్టాలి
నామినేషన్ కోటాలో చట్ట సభలకు పంపాలి
వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి
'యుద్ధ భేరీ' వేదికపై మంద కృష్ణ గర్జన
కష్టాలు కళ్లారా చూశాను
మీ పోరాటానికి మద్దతు
చంద్రబాబు సంఘీభావం

హైదరాబాద్ : వృద్ధులు, వితంతువుల పెన్షన్లు వెయ్యి రూపాయలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దీనిపై నెలరోజుల్లోపు స్పందించకపోతే... సర్కారుపై సమరం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'వృద్ధులు, వితంతువుల యుద్ధ భేరీ' కార్యక్రమంలో మంద కృష్ణ ప్రసంగించారు. " మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేకపోతే... ఈ సర్కారును భూస్థాపితం చేయడానికి ఉద్యమం చేపడతాం. రాష్ట్రంలో ఇంకా 40 వేల మంది వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందడంలేదు. వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలి'' అని డిమాండ్ చేశారు.

చట్ట సభల్లో వృద్ధులు, వితంతువుల తరఫున మాట్లాడేందుకు గవర్నర్ కోటాలో, రాష్ట్రపతి కోటాలో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేయాలన్నారు. పెన్షన్లు ఇచ్చినా కొంత మంది వృద్ధులు సొంతంగా జీవించే పరిస్థితి లేదని... అందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి... దానికి వృద్ధులనే మంత్రిగా నియమించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు ప్రయాణ రాయితీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణను రెండుసార్లు కలిశామని... ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినప్పటికీ, అది అమలులోకి మాత్రం రాలేదని మంద కృష్ణ తెలిపారు. "ప్రభుత్వం వెంటనే వృద్ధులకు, వితంతువులకు ప్రయాణ రాయితీ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు రూ.500లు ఫించను ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.200లు మాత్రమే ఇస్తోంది'' అని తెలిపారు.

ఆరోగ్యశ్రీ సాధించాం...
ఎమ్మార్పీఎస్ కేవలం కులం కోసమే కాకుండా... మానవతా సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తుందని మంద కృష్ణ తెలిపారు. చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం పోరాటం చేసి... ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించింది తామే అని తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్ నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. "గుండె ఆపరేషన్ కోసం ఒక బాలికను వైఎస్ వద్దకు తీసుకెళితే... పాతిక వేలకంటే ఎక్కువ సహాయం చేయలేమన్నారు. నీ ఉద్యమం సంగతి, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు అని హెచ్చరించారు.
గుండె జబ్బుతో చనిపోయిన బాలుడి మృతదేహంతో నేను, కిషన్ రెడ్డి (బీజేపీ నేత) ఆందోళనకు దిగినప్పుడు ఢిల్లీ నుంచే ఫోన్ చేసి వైఎస్ హెచ్చరించారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే'' అంటూ ఆ వార్తల క్లిప్పింగ్స్‌ను మంద కృష్ణ చూపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు, వితంతువులు ఎంతో నమ్మకంతో ఈ సమావేశానికి వచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యాన్ని సాధిస్తామని మంద కృష్ణ ప్రకటించారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచాలని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని... కానీ, సర్కారు స్పందించే పరిస్థితి కనపడటం లేదని తెలిపారు. మళ్లీ ఇంకోసారి ప్రతిపక్ష నేతలతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని... నెల రోజుల్లో స్పందన లేకపోతే సమర భేరీ మోగిస్తామని మంద కృష్ణ హెచ్చరించారు.

సంపూర్ణ మద్దతు: చంద్రబాబు మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన వృద్ధులు, వికలాంగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన ఆయన... కొద్దిసేపటికే 'యుద్ధ భేరీ' సభకు వెళ్లారు. "ఏడు నెలల పాటు ప్రజల్లో ఉన్నాను. ఎన్నో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు పడుతున్న బాధలను స్వయంగా చూశాను. వృద్ధులు, వితంతువుల కోసం మంద కృష్ణ చేసిన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'' అని ప్రకటించారు.

బెల్టు షాపులు తీసేయాలని మహిళలు కోరుతున్నారని, తమ ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సంతకం రైతుల రుణ మాఫీ, రెండో సంతకం మద్య నియంత్రణపై పెడతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జనాభా దామాషాన వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినా కొన్ని కారణాలతో ఆగిపోయిందని, దానిని కాంగ్రెస్ కొనసాగించలేకపోయిందని తెలిపారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

మంద కృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తే: సర్వే మంద కృష్ణ మాదిగలకు జాతిపితలాంటి వాడని, అలాంటి వ్యక్తి సోనియా గాంధీతో కలిసి ప్రయాణం చేస్తే మాదిగ జాతి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. వృద్ధుల, వితంతువుల ఫించన్లు దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సోనియాను కోరతామన్నారు. యుద్ధ భేరీ కార్యక్రమం ఎంబీసీ అధ్యక్షుడు సండ్ర వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.

మానవతా ఉద్యమం: కిషన్‌రెడ్డి మందకృష్ణ ఉద్యమం..కేవలం సామాజిక ఉద్యమమే కాదని, అదొక మానవతా ఉద్యమమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు. గుండె జబ్బు పిల్లల కోసం ఆయన చేసిన పోరాటం వల్లే 'ఆరోగ్యశ్రీ' పెట్టినట్టు వైఎస్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి పింఛను అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, తమ పార్టీ ఆవిర్భావ సభలో వృద్ధులకు, వితంతువులకు రూ.1500లు పింఛను ఇవ్వాలని తీర్మానం చేసినట్లు టీఆర్ఎస్‌పక్షనేత ఈటెల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రిని పింఛను పెంచాలని కోరితే డబ్బులెక్కడున్నాయని ప్రశ్నించారని, ఆ ప్రశ్నకు 'యుద్ధభేరీ'తో మందకృష్ణ సమాధానమిచ్చారని చెప్పారు. బయ్యారం లాంటి గనులు జాతికి అంకితమైతే.. ఎన్ని సంవత్సరాలైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.