April 29, 2013

అపూర్వ స్వాగతం శంషాబాద్ నుంచి ఇంటిదాకా నీరాజనం

వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు
ఆరుగంటలకుపైగా బైక్ ర్యాలీ
208 గుమ్మడికాయలతో దిష్టి



ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బైక్ ర్యాలీ ప్రారంభించారు. సుమారు మూడువేల ద్విచక్రవాహనాలలో పార్టీ జెండా పట్టుకొని తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ శంషాబాద్ బయలుదేరారు. 1.30 గంటలకే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం శంషాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం గతంలో ఎన్నడూలేని స్థాయిలో జనంతో కిక్కిరిసింది. చంద్రబాబును చూసేందుకు జనం తోసుకుని ముందుకు రావడంతో వారిని నియంత్రిచేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. సరిగ్గా 2.55గంటలకు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ విమానాశ్రయం నుంచి బయటికి వచ్చారు.

ఊరేగింపు వాహనం ఎక్కారు. శంషాబాద్ నుంచి ఆరాంఘర్, అత్తాపూర్, మెహదీపట్నం, మసాబ్ ట్యాంక్ మీదుగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి... అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ గిరిజనులు సంప్రదాయ నృత్యంతో బాబుకు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం కావాల్సి ఉన్నా... ఎమ్మార్పీఎస్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండడంతో దానిని చంద్రబాబు రద్దు చేసుకున్నారు. బ్రహ్మానంద రెడ్డి పార్కు వద్ద టీడీపీ అనుబంధ తెలుగు రక్షణ వేదిక, ఎస్టీ విభాగాల ప్రతినిధులు బాబుకు స్వాగతం పలికారు. దారి పొడవునా చంద్రబాబు పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బాబుకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ప్రత్యేక వేదికలను కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వాగత ర్యాలీలో బాలకృష్ణ సందడి చేశారు. వాహనంపై కూర్చుని ఆద్యంతం నవ్వుతూ, అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు.

పూలబాటపై ఇంటికి... ఏడు నెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్న చంద్రబాబుకు భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. తెలుగు మహిళలు ప్రధాన రహదారి నుంచి ఇంటి గుమ్మం వరకూ బంతిపూలు పరిచారు. పూలబాటపై నడుస్తూ వచ్చిన చంద్రబాబుకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 208 గుమ్మడి కాయలపై కర్పూరం వెలిగించి దిష్టితీసి పగులగొట్టారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు బాబును ఆశీర్వదించారు. 8.39గంటలకు ఇంటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న బాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. లోకేశ్ కాస్త ముందుగానే ఇంటికి రాగా బాలకృష్ణ నేరుగా తన ఇంటికి వెళ్లారు. బావ మరిది రామకృష్ణ, ఇతర బంధువులు బాబును పలకరించారు. ఆరో గ్యం ఎలా ఉంది బావా? అని రామకృష్ణ కుశల ప్రశ్నలు వేశారు. చిటికెన వేలి నొప్పి గురించి ఆరా తీశారు.

హాజరు కాలేకపోయిన నేతలు... ఆదివారం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును స్వాగతించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రాలేకపోయారు. శనివారం విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, నాయకులకు విమానాల్లో టికెట్లు దొరక్కపోవడంతో ఆదివారం హైదరాబాద్ చేరుకోలేకపోయారు.
కొసమెరుపు: చంద్రబాబు దృష్టిలో పడేందుకు నేతలు పోటీపడ్డారు. తమ పేర్లతో భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బాబు నివాసం వరకు మొత్తం కటౌట్లు, బ్యానర్లతో నింపి వేశారు.
హైదరాబాద్ సుదీర్ఘ పాదయాత్రతో చరిత్ర సృష్టించి.... తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం దాకా... సుమారు 6 గంటలపాటు విజయ యాత్ర సాగించారు. ద్విచక్ర వాహనాలపై కార్యకర్తలు తరలిరాగా... భారీ వాహన శ్రేణితో చంద్రబాబు ఊరేగింపుగా బయలు దేరారు. హైదరాబాద్ నగరంతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి తరలి వచ్చారు.