March 2, 2013

నాడు వారధి కట్టా... నేడు రైల్వే లైను నిర్మిస్తా

వారధి నిర్మాణం చేపట్టి జాతీయ రహదారిని ఏర్పాటు చేసిన విధంగానే మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు టీడీపీ పాలనలోనే జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లాలోకి మలివిడత వస్తున్నా..మీకోసం పాదయాత్ర చేపట్టిన ఆయన బుధవారం రాత్రి అవనిగడ్డ వంతెన సెంటర్‌లో జరిగిన

బహిరంగసభలో ప్రసంగించారు....

అవనిగడ్డ-మచిలీపట్నం ,ఫిబ్రవరి 28: వారధి నిర్మాణం చేపట్టి జాతీయ రహదారిని ఏర్పాటు చేసిన విధంగానే మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ ఏర్పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లాలో బుధవారం రాత్రి అవనిగడ్డ వంతెనసెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ్ఘబాబు ప్రసంగించారు. బ్రిటిష్ కాలం నాటి క్యాంప్‌బెల్ ఆక్విడెక్ట్ నిర్మాణం తర్వాత పెద ్దనిర్మాణం తనహయాంలోనే చేపట్టాననీ, పులిగడ్డ ఆక్విడెక్టు ప్రత్యామ్నాయంగా పులిగడ్డ-పెనుమూడి వారధిని నిర్మించినట్లు తెలిపారు. కోస్తా హైవేని కలిపేందుకు వారధి ఉపయోగపడిందనీ, నరసాపురం నుంచి ఒంగోలు వరకూ 214ఏ జాతీయ రహదారిని చేస్తే దానిని అభివృద్ధి చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తుపాను వస్తే దివిసీమ ఉలికిపాటుకు గురవుతుందనీ, 1999లో వచ్చిన ఉప్పెనకు రాత్రంతా తాను నిద్రపోకుండా అధికారయంత్రాంగాన్ని అప్రమత్తంచేసి సహాయక చర్యలు చేయించానన్నారు. అవనిగడ్డ ప్రాంత అభివృద్ధికి దోహదపడే మచిలీపట్నం-రేపల్లె కోస్తా రైలు లింకుమార్గం కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదన్నారు. అసెంబ్లీలో బీసీలకు 100 సీట్లిస్తామని బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. గతంలో డెల్టాకు ఒకపంటకు నీరే వచ్చేదనీ, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రెండు పంటలకూ నీరందిందనీ, నేడు ఆధునికీకరణ పేరుతో ఒకపంటకే నీరివ్వటం దారుణమన్నారు. మహిళల మెడలో బంగారం అవసరాలకోసం బ్యాంకుల్లో తాకట్టుపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బంగారం ధర పెరిగేందుకు వైఎస్ పెద్దకొడుకు గాలి జనార్ధనరెడ్డి కారణమనీ, దేశంలోని బంగారాన్నంతా కొని కూడబెట్టటంతో బంగారం ధర రూ.ఐదు వేల నుంచి రూ.30వేలకు పెరిగిందన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారనీ, సెల్‌ఫోన్‌లో ఎస్ఎంఎస్ చేస్తే మద్యం వస్తున్నా, ఫోన్‌చేసి అడిగినా నీరు రావడంలేదని విమర్శించారు. ఆటోల్లో వెళుతున్న మహిళలను పోలీసులు వేధింపులకు గురిచేయటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన ప్రభుత్వమని దుయ్యబట్టారు. వైఎస్సార్ అవినీతికి గేట్లు తెరిచాడని విమర్శించారు. సీల్డ్ కవర్ ద్వారా సీఎం పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు అన్నీ తెలుసని ఫోజులు కొట్టటం మినహా ఏమీ తెలియదన్నారు. వైఎస్ చేసిన అవినీతి మనకు శాపంగా మారిందనీ, తండ్రీ, కొడుకులు లక్షలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.