March 2, 2013

పార్టీని గెలిపించే బాధ్యత మీది..మీ బాధ్యత నాది


పార్టీని గెలిపించే బాధ్యత మీది...మీ బాధ్యత నాది...అదిచేసి నా నిజాయితీని నిరూపించుకుంటునానని అధినేత చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా కూచిపూడిలో శనివారం ఉదయం అవనిగడ్డ, తిరువూరు నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాగద్వేషాలకు తావులేదనీ, ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా అర్హత ఉన్నవారినే ఎంపికచేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పదవులు కావాలంటే ప్రజల్లో పలుకుబడి ఉండాలనీ, ఆ నాయకుడిపై కార్యకర్తల్లో నమ్మకముండాలన్నారు. టీడీపీకి ఉన్న పెద్దబలం కార్యకర్తలేననీ, ఏపార్టీకి లేని ఈ బలాన్ని 30 ఏళ్ళుగా నిర్మాణం చేసుకుంటూ వచ్చినట్లు చెప్పారు.

క్యాడర్‌ను సద్వినియోగం చేసుకోవటంలో ఇన్‌చార్జీలు విఫలమవుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో కఠినంగా ఉంటాననీ, అలా ఉంటేనే నేతలు బాగుపడతారనీ, పనిచేయకుంటే తొలగించట ఖాయమని చంద్రబాబు తేల్చిచెప్పారు. వ్యక్తిగత విభేదాలు, ఇగోలతో పార్టీని దెబ్బతీయటం మంచిదికాదనీ, అది మనకే నష్టమన్నారు. ప్రతి జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు, మండలాల వారీ సమావేశాలు నిర్వహించి పార్టీ గెలుపు ఓటములపై సమీక్షించాలన్నారు.

బీసీ డిక్లరేషన్, ముస్లిం పాలసీ, వర్గీకరణ, రుణమాఫీ అంశాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయో చూడాలనీ, అందుకు గ్రామాల్లో ప్రచారం చేపట్టాలన్నారు. నాయకులు ఇంకొంచె హుషారుగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యకర్తలు ఏమంటున్నారంటే..

* ఘంటసాల మండలానికి చెందిన పరిశె చలపతిరావు మాట్లాడుతూ టికెట్టు ఇచ్చేముందు ఆ అభ్యర్థి సంవత్సరం నియోజకవర్గంలో పనిచేయాలన్నారు. ఎవరినో తీసుకువచ్చి నిలబెట్టడం మేము గెలిపించటం వల్ల కార్యకర్తలకు బలం చేకూరడంలేదన్నారు.

* మోపిదేవి మండలానికి చెందిన నారగం పరంజ్యోతి మాట్లాడుతూ ఉద్యోగులను దగ్గరకు తీసుకోవాలనీ, వారికున్న అపోహలను తొలగించి ఆకట్టుకోవాలని కోరారు.

పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ విభేదాల గురించి ప్రస్తావించగా, వ్యక్తిగత విబేధాలను సరిచేసుకోవాలన్నారు. పార్టీకి నష్టపరిచే చర్యలను సహించబోనన్నారు. పాదయాత్రకు వెళ్ళాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే జిల్లాలో ఆరు రోజులు ఉంటా.. విని తగు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

సమావేశంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీనేతలు నలగట్ల స్వామిదాసు, కేశినేని నాని, వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావు, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, కంఠంనేని రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.