March 2, 2013

ఎంత సేపు నిద్రపోతారో నిద్రపోండి!

నేను నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను'... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇది. అదే చంద్రబాబు... 'ఎంత సేపు నిద్రపోతారో నిద్రపోండి!' అని అంటే!? నమ్మశక్యంగా లేదు కదూ! నిజంగానే అన్నారు. తెలుగు తమ్ముళ్లతో సరదా సరదాగా మాట్లాడారు. చలోక్తులు విసురుతూ, కర్తవ్య బోధ చేస్తూ, భరోసా ఇస్తూ మాట్లాడారు.

శనివారం కృష్ణా జిల్లా కూచిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన పాలనతో ప్రజలను కష్టాల పాలు చేస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చు కదా!' ఓ కార్యకర్త ఆవేశంగా ప్రశ్నించడంతో... 'అవసరమైతే అవిశ్వాసం పెడదాం తమ్ముడూ. దీనివల్ల నీకొచ్చే లాభమేంటో' అని చంద్రబాబు నవ్వుతూ ప్రశ్నించారు.

అవిశ్వాసం పిల్ల కాంగ్రెస్ బేరసారాలకు పనికొస్తుందని, కాంగ్రెస్ వాళ్లకు సూట్‌కేసులు అందుతాయని అన్నారు. 'దేనికైనా తగిన సమయం రావాలి. మనం ఆత్రుత ప్రదర్శిస్తున్నామని ప్రజలు భావించకూడదు తమ్ముడూ' అని సర్దిచెప్పారు. గతంలో తాను సీఎంగా చేసిన సమయంలో నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వననే స్థాయిలో పని చేస్తే... కార్యకర్తలు దీనిపై వ్యతిరేక ప్రచారం చేశారని, దీనివల్ల ఉద్యోగులకు వ్యతిరేకమయ్యామని బాబు అన్నారు. 'ఈసారి మీరు ఎంతసేపు పడుకుంటారో పడుకోండి! ఆ తర్వాత అంతా కలిసి పనిచేద్దాం!' అనే కొత్త నినాదంతో ముందుకువెళదామని చెణుకులు విసిరారు.