March 2, 2013

ఈ ఏడాదంతా జనంలోనే బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఏడాదంతా జనంలోనే ఉండబోతున్నారు. దీని కోసం ఆయన ఒక బృహత్ ప్రణాళిక రూపొందించుకొన్నారు. ఈ ప్రణాళిక అమలుపై ఆయన ఇప్పటికే పార్టీ సీనియర్లతో సమాలోచనలు సాగిస్తున్నారు. గత నూటా ఏభై రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న ప్రస్తుత తన పాదయాత్రను మే ఒకటో తేదీతో ముగించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ముందు అనుకొన్నట్లుగా మే ఒకటో తేదీ నాటికి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించనున్నారు.

'పరిస్థితులను బట్టి ఒకటి రెండు రోజులు అటూఇటూ కావచ్చు. ఇది తాత్కాలిక ముహూర్తం' అని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి కాగానే మే నెలాఖరులో హైదరాబాద్‌లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహణకు నడుం కట్టనున్నారు. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే మహానాడు సందర్భంగా రాష్ట్ర స్ధాయిలో భారీ సభను నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో అనవాయితీగా వస్తోంది. మే 28వ తేదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పుట్టిన రోజు. ఆ తేదీనే ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనితోపాటు మరో రెండు రోజులపాటు మహానాడు ప్రతినిధుల సమావేశాలు కూడా నిర్వహించాలా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు.

సభ ముగిసిన వెంటనే జూన్ నుంచి రెండో విడత పాదయాత్రకు చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి వెళ్ళాలని అనుకొంటున్నారు. మొదటి విడత పాదయాత్రలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను సందర్శించలేకపోయారు. మలి విడతలో ఈ జిల్లాల్లో పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ పాదయాత్రతోనే వెళ్తానని, కుదరకపోతే అప్పుడు ఆలోచిస్తానని ఆయన పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సుమారు వంద నియోజకవర్గాలు సందర్శిస్తారని అంచనా.

ఇంకా సుమారు 194 దాకా మిగిలిపోయి ఉంటాయి. వీటినీ, మండలాలవారీగా కలుపుకుపోయేలా బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 'ఎన్నికలు కొంత ముందు రావచ్చునని అందరూ అనుకొంటున్నారు. ఈలోపే రాష్ట్రంలో ప్రతి మండలం సందర్శించి ప్రజల్లోకి వెళ్ళడం, పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడం, పార్టీ వాణిని వినిపించడం ఆయన లక్ష్యాలు. ఈ లెక్కన ఈ ఏడాదంతా ఆయన జనంలోనే ఉండేలా కనిపిస్తోంది' అని ఒక సీనియర్ నేత పేర్కొన్నారు.